రాజ్యసభలోనూ టీ ఆమోదం: మన్మోహన్‌సింగ్
టీ బిల్లుపై కేసీఆర్‌కు ప్రధాని భరోసా
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ఏర్పాటు పూర్తయిపోయినట్టేనని, గురువారం రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్‌కు ప్రధానమంత్రి ఎదురయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేసీఆర్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ప్రధాని కేసీఆర్ భుజం తట్టి తెలంగాణ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందుతుందని భరోసా ఇచ్చారు.
రాజ్యసభలో అవరోధాలున్నాయా?
తెలంగాణ బిల్లుకు సవరణలు చేయాలంటూ రాజ్యసభలో బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, బిల్లు ఆమోదానికి ఏవైనా సాంకేతిక ఇబ్బందులున్నాయా అని కేసీఆర్ నిపుణులతో చర్చించారు. ఎమ్మెల్యేలు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు, కేంద్ర సమాచార కమిషనర్, న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్, రిటైర్డు ఐఏఎస్‌లు ఎ.కె.గోయల్, రామ లక్ష్మణ్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, విశ్లేషకులు వి.ప్రకాశ్ తదితరులతో కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజ్యసభలో సవరణలు చేయాల్సి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదానిపై కేసీఆర్ తెలుసుకున్నారు. ఏదేమైనా తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ కృతనిశ్చయంతో ఉన్నారని, ఇక ఎలాంటి అవరోధాలు ఉండవని కేసీఆర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్‌వైపు టీ-టీడీపీ ఎమ్మెల్యేల మొగ్గు?
తెలంగాణకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలని ఆసక్తి చూపిస్తున్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు వెల్లడించారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఆ పార్టీలో చేరకుండా, టీఆర్‌ఎస్‌లో చేరాలని కోరుకుంటున్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నా, విలీనమైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుంటున్నామని సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుందనే యోచనలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు.