
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిపుట్టిస్తున్నాయి. రఫేల్, రామ మందిరం, కావేరీ జలాల సమస్యలపై ఉభయ సభలు దద్దరిల్లాయి. బుధవారం రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే పలు అంశాలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభా కార్యక్రమాలు నడవకుండానే గురువారానికి ఉభయసభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్, శివసేన, అన్నా డీఎంకే సభ్యులు వారి వారి సమస్యలు తీర్చాలంటూ ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. రఫేల్ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తమిళనాడులోని కావేరీ తీరప్రాంత రైతులకు న్యాయం చేయాలని అన్నా డీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. వారిని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంతగా వారించినా వారు వినకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో ఆటిజం బిల్లుకు ఆమోదం..
ప్రతిపక్షాలు నినాదాల మధ్యే రాజ్యసభలో ఆటిజం బిల్లుకు ఆమోదం లభించింది. నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్‌ఫేర్ ఆఫ్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ (సవరణ)–2018 బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కావేరీ జలాలపై అన్నా డీఎంకే, డీఎంకే పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. వారివారి సీట్లలోకి వెళ్లి కూర్చోవాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సభ్యులను కోరారు. సభ్యులు వినకుండా నిరసన వ్యక్తం చేస్తుండటంతో పెద్దల సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment