అందరిచూపు హస్తినవైపే..! ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేకరాష్ట్రం కల సాకారమయ్యేదశలో ఏమవుతుందోనని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమయంలో ఎదురవుతున్న అవరోధాల దృష్ట్యా జిల్లావాసుల్లో హైటెన్షన్ నెలకొంది. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందుతుందని, నిశ్చింతగా ఉండాలని ఢిల్లీలోనే మకాం వేసిన జిల్లా ఎంపీలు కేసీఆర్, మందా జగన్నాథం ప్రజలకు భరోసా ఇస్తున్నారు. బిల్లుపై భిన్నస్వరాలు వినిపిస్తున్న బీజేపీ జాతీయ నేతలపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ నేతలు ఢిల్లీబాట పట్టారు..
సాక్షి, మహబూబ్‌నగర్: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రోజు సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య చోటుచేసుకున్న తోపులాట జరిగి తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలి సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
మంగళ, బుధవారాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనుండటంతో పాటు ఆమోదం కోసం ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తె లంగాణ బిల్లుకు కచ్చితంగా ఆమోదముద్ర పడుతుందని తె లంగాణవాదులు ముఖ్యంగా పాలమూరు వాసులు ధీమావ్యక్తం చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందేందుకు జిల్లా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌స భ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తు న్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మందా జగన్నాథం వివిధ పార్టీల అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తె లిసిందే. ఇతరపార్టీల నేతల మద్దతు కూడా కూడగట్టేందుకు టీఆర్‌ఎస్, టీజేఏ సీ, టీజీఓ నాయకులు ఢిల్లీలో మకాం వేశారు.
ఎవరికి వారే..!
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఎంపీ మందా జగన్నాథం, మరికొంత మంది టీఆర్‌ఎస్ నాయకులు, టీజేఏసీ, టీజీఓ ప్రతినిధులు కూడా ఢిల్లీలో మకాం వేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందే విధంగా కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకుల మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లి తమ జాతీయ నాయకులపై ఒత్తిడి పెంచడం ద్వారా తెలంగాణ బిల్లుకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. బిల్లుకు మద్దతివ్వడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలోపేతమవుతుందని జాతీయనేతల వద్ద ప్రస్తావిస్తూ ఒత్తిడి పెంచుతున్నారు.
బిల్లుపైనే చర్చ
సమైక్యవాదులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు కొం దరు అక్కడే మకాంవేసి ఎలాగైనా బిల్లును అడ్డుకుంటామని గట్టిగా చెబుతుండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళనసర్వత్రా నెలకొంది. దీనికితోడు బిల్లు ఆమోదం పొందుతుందని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న పాలమూరు వాసులు బీజేపీ జాతీయ నాయకులు భిన్నస్వరాలు వినిపిస్తుండటంతో అయోమయానికి గురవుతున్నారు.
బిల్లుకు మద్దతు తెలిపే విషయంపై బీజేపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌నేతలు ఆరోపిస్తున్నారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదం కోసం చర్చించే విషయంపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టత, విధివిధానాలు లేవని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ప్రధానపట్టణాలు, మండల కేంద్రాలతోపాటు ఎక్కడ నలుగురైదుగురు గుమికూడి నా తెలంగాణ బిల్లుపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
చూపు..ఢిల్లీ వైపు
Published Mon, Feb 17 2014 4:11 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement