న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు.
ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. కనీస వేతనాల చట్టం–1948, వేతనాల చెల్లింపు చట్టం–1936, బోనస్ చెల్లింపు చట్టం–1965, సమాన వేతనాల చట్టం–1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకు మించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.