తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని, లేకుంటే మరోమారు ఉద్యమం చేపట్టేందుకు వెనుకాడబోమని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని, లేకుంటే మరోమారు ఉద్యమం చేపట్టేందుకు వెనుకాడబోమని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న సీమాంధ్ర ఉద్యోగ వర్గాలపై ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ఉద్యోగులు కృత్రిమ ఉద్యమం నడుపుతూ అయోమయం సృష్టిస్తున్నారని, ఎందరు అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని పేర్కొన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం సమ్మె పేరుతో హడావుడి చేస్తున్నారని, రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారారని దుయ్యబట్టారు. ప్రజల మద్దతుతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు పాల్గొనడంలేదని అన్నారు. ఈ పరిణామాలను పరిశీలించి కాంగ్రెస్ పార్టీ సత్వరమే బిల్లు పెట్టాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రూపేందర్‌రెడ్డి, రవీందర్ కోరారు.