
సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: తన ఏడాది పదవీకాలం ఒకింత పులుపుగా.. ఒకింత తీపిగా ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. పాతికేళ్లుగా ఏటా మీడియా ప్రతినిధులకు విందు ఏర్పాటు చేస్తున్న వెంకయ్య.. ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. సోమవారం తన అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. బూరెలు, డబల్ కా మీఠా నుంచి చేపల కూర వరకు దక్షిణాది వంటకాలతో రుచికరంగా విందు ఏర్పాటు చేశారు. తాను ఉప రాష్ట్రపతి అయ్యాక నిర్మించిన సమావేశ మందిరాల విశేషాలను, అక్కడ జరిగే సంగీత సాహిత్య కార్యక్రమాలను వివరించారు.
ఈ పదవిని ఎలా ఆస్వాదిస్తున్నారు.. ఇతర పదవులకు దీనికి ఉన్న తేడా ఏంటన్న ప్రశ్నలకు వెంకయ్య బదులిస్తూ ‘‘కట్టా.. మీటా.. అని ఒక్క మాటలో చెప్పగలను. పని లేకుండా నేను ఉండను.. పనిలోనే ఆనందాన్ని పొందుతాను. ప్రజలతో మమేకమవడం నా బలహీనత. వారిని కలవడం, మాట్లాడటం, నడవడం, కలిసి తినడం ఇష్టం. అందరి ఇళ్లకు వెళ్లేవాడిని. నా కూతురు.. ‘మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారు’ అని వ్యంగ్యంగా అనేది. దేశంలో అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని జిల్లాలు తిరిగాను. ఏనాడూ అలసిపోలేదు. ఇప్పుడు ప్రోటోకాల్ కారణంగా ప్రజలతో నిత్యం మమేకమవడం కష్టసాధ్యమైన పని’’అని తెలిపారు.
సర్దుకుపోతున్నా..
‘‘స్పందించకుండా ఉండలేను.. కానీ ఈ పదవిలో ఉంటూ రియాక్ట్ అవడం కుదరదు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా కాన్‌స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి మాట్లాడాలి. ప్రోటోకాల్ కారణంగా వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లాల న్నా కుదరదు. సాధారణ విమానాల్లోనూ వెళ్లడం కుదరదు. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటా యి. సర్దుకుపోతున్నా. ప్రజలను, రైతులను, విద్యార్థులను కలవడంపై చాలా ఆసక్తి ఉంది. ఈ పదవిలో ఉన్నా కలుస్తూనే ఉంటాను. విశ్వవిద్యాలయాలను తరచుగా సందర్శిస్తాను. సైన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలను సందర్శిస్తాను’’అని పేర్కొన్నారు. ‘‘2019 ఎన్నికల వరకు రాజకీయాల్లో ఉండి.. తర్వాత సామాజిక సేవాలో నిమగ్నమవ్వాలనుకున్నా. కానీ ఉపరాష్ట్రపతినయ్యాను. కొంత సమ యం కుటుంబానికి కేటాయించడానికి అవకాశం దొరకడంతో వారూ సంతోషపడుతున్నారు’’అని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపులపై..
‘‘పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగితే అధికారపక్షం, విపక్షాలు, ప్రజలు ఆస్వాదించవచ్చు. నిబంధనలను పాటించాలని అనడం, పాటించడం కష్టమే. కానీ వాటి నుంచి వచ్చే ఫలితాలు ఊహించని రీతిలో ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై తక్షణం నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారికి వన్నె తెస్తుంది. అందరూ దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని భావిస్తున్నా’’అని వెంకయ్య పేర్కొన్నారు.