సంపాదకీయం: అయిదేళ్లపాటు పార్లమెంటు సమావేశాలను సజావుగా నడపడంలో దారుణంగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభం కానున్న చిట్టచివరి సమావేశాల్లో ఏదో అద్భుతాలు చేయగలదని ఎవరూ అనుకోరు. నెలరోజుల్లోపే రద్దుకానున్న 15వ లోక్‌సభ ముందు ఇప్పుడు 72 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో అన్నీ కాకపోయినా వివాదాస్పదమైన తెలంగాణ బిల్లు, మహిళా కోటా బిల్లు, లోక్‌పాల్‌కు సంబంధించిన నాలుగు బిల్లులు, వికలాంగుల హక్కుల బిల్లువంటి 39 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడుతోంది.
ఇవిగాక రైల్వే, ఆర్ధిక బడ్జెట్‌లకు సంబంధించిన ఓటాన్ అకౌంట్‌లు ఉండనే ఉన్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రతిసారీ అఖిలపక్షాన్ని సమావేశపరిచి సభ ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడమని విపక్షాన్ని అభ్యర్థించడం మామూలే. కానీ సమావేశాల ముందో, అవి సాగుతుండగానో వెల్లడయ్యే స్కాములు... వాటిపై అవసరమైన విచారణకు ప్రభుత్వం సిద్ధంకాకపోవడం పర్యవసానంగా పార్లమెంటు వాయిదాల్లో గడిచిపోవడం ఈ అయిదేళ్ల కాలంలో చాలా సార్లు జరిగింది. అన్ని పక్షాలతోనూ చర్చించి తీసుకున్న నిర్ణయంగా యూపీఏ సర్కారు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం కొత్త సమస్యలను మోసుకొచ్చింది. ఆ సమస్యల ప్రభావం పార్లమెంటు కార్యకలాపాలపై పడింది.
ఇన్ని సమస్యలు వెన్నాడుతుండగా, లోక్‌సభకు ఎన్నికలు ముంచు కొస్తుండగా కొసమెరుపు మెరిపించాలని, జనం జేజేలను అందుకోవాలని యూపీఏ సర్కారు భావిస్తున్నది. అయితే, ఇందుకు చేసే ప్రయత్నాల్లో చిత్తశుద్ధి కొరవడింది. బిల్లుల ఆమోదానికి సహకరించనిపక్షంలో ప్రత్యర్థి పక్షాల నైజాన్ని బట్టబయలు చేయవచ్చునని... అవి సహకరిస్తే ఎలాగూ ఆ బిల్లులను తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందని భావిస్తోంది. ఒకవేళ లోక్‌సభ సజావుగా నడపలేకున్నా... అక్కడ ప్రవేశ పెట్టే బిల్లులు ముందుకు కదలక మురిగిపోయే స్థితి ఉంటే... అలాంటి బిల్లుల్ని ఎటూ రాజ్యసభలో పెట్టి వాటి ఉనికిని కాపాడవచ్చునని అను కుంటోంది.
బిల్లుల ప్రాముఖ్యాన్ని, వాటి ద్వారా తీరగల ప్రజా ప్రయోజ నాలనూ దృష్టిలో పెట్టుకోవడం కాక... అవతలి పక్షాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహం పన్నడం రాజకీయం అవుతుందే తప్ప చిత్తశుద్ధి అనిపించుకోదు. అవినీతి నిరోధానికి బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడగలదని చెబుతున్న లోక్‌పాల్, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మహిళా కోటా బిల్లు, తెలంగాణ ఏర్పాటు అంశాల్లో విపక్షాలు సహకరించకపోతే ఆ సంగతిని జనంలో జోరుగా ప్రచారం చేసుకోవచ్చునని పాలకపక్షం తలపోస్తున్నది. క్రితం సమా వేశాల్లో అధికారపక్షం ఎంపీలే సభకు అవరోధంగా నిలిచారు గనుక ముం దు సొంతింటిని చక్కదిద్దుకోమని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ చెబుతోంది.
ఈ వ్యూహ ప్రతివ్యూహాల సంగతలా ఉంచి యూపీఏ సర్కారు వైఫల్యం ఈ అయిదేళ్లలోనూ అడుగడుగునా కనబడింది. మొదటి లోక్‌సభతో మొదలెట్టి ఇంతవరకూ కొనసాగిన 15 సభల తీరుతెన్నులు గమనిస్తే ఇప్పటి సభ మాత్రమే 72 పెండింగ్ బిల్లులతో అన్నిటినీ తలదన్నింది. ఈ బిల్లుల్లో సర్కారు చెబుతున్నట్టు నిజంగా విపక్షాలన్నీ సహకరించి 39 బిల్లులు ఆమోదం పొందుతాయనుకున్నా 33 బిల్లులు మురిగిపోతాయి. ఇలా మురిగిపోవడానికి అవకాశం ఉన్న బిల్లుల్లో విద్యా ట్రిబ్యునళ్ల బిల్లు, న్యాయ ప్రమాణాల బిల్లు, అణు భద్రత బిల్లు, ఇండో- బంగ్లా సరిహద్దు ఒడంబడిక వంటివి ఉన్నాయి. అయితే, 39 బిల్లులను సాకల్యంగా చర్చించడానికీ, అవసరమైన సవరణలను చేయడానికి కావలసిన వ్యవధి ఏమాత్రం లేదు. ఈ సమావేశాలు కేవలం పక్షంరోజులు మాత్రమే జరగబోతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు విషయంలో తీసుకొచ్చిన బిల్లును నయానా భయానా అందరినీ దారికి తెచ్చుకుని ఆమోదింపజేసుకున్న ఘనత యూపీఏ సర్కారుకున్న మాట నిజమే. తెలుగుదేశం అధినేత బాబుతో మాట్లాడి ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు చేయించి ప్రభుత్వం గట్టెక్కిన సంగతి ఎవరూ మరిచిపోలేరు.
అయితే, చివరాఖరి సమావేశాల్లో అలాంటి ఎత్తులు పారుతాయనుకోవడం కుదరదు. జనమంతా తమనే గమనిస్తారు గనుక అన్ని పార్టీలూ ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తాయి. ఎంతో ముఖ్య మైన బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయని, దానివల్ల వివిధ వర్గాలకు అందవలసిన ప్రయోజనాలు దూరమవుతున్నాయని కేంద్రం నిజంగా భావించివుంటే గత సమావేశాలనైనా సరిగా జరిగేలా చూసేది. కానీ, ఆ సమావేశాలను రెండురోజులముందే ముగించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇన్ని బిల్లులు పెండింగ్‌లో ఉండగా వాటినలా ముగించడం విడ్డూరమే. అప్పటికి గండం గడిచి గట్టెక్కితే చాలనుకునే సంకుచిత దృక్పథమే ఇందుకు కారణం. వాస్తవానికి ఒక పార్లమెంటు పనితీరు కొలవడానికి అది ఆమోదించిన బిల్లుల సంఖ్య గీటురాయి కాదు. ఎన్ని బిల్లులపై అది అర్ధవంతమైన చర్చలను సాగించగలిగిందన్నదే ప్రధాన మైనది. సంఖ్యరీత్యా చూస్తే ప్రస్తుత లోక్‌సభ ఈ అయిదేళ్ల వ్యవధిలోనూ ఇంతవరకూ 165 బిల్లును ఆమోదించింది.
ఇందులో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన బిల్లులెన్నో చూస్తే మన చట్టసభల బండారం బయటపడుతుంది. అధిక ధరలు, అవినీతి, ఉపాధి లేమి, సాగు సంక్షో భం వంటి కీలకమైన సమస్యలపై చర్చలు, వాటి పరిష్కార మార్గాలు అన్వేషించడంలో లోక్‌సభ ఏనాడూ శ్రద్ధపెట్టలేకపోయింది. ఇప్పుడు చివరి నిమిషంలో స్వీయప్రయోజనాలను ఆశించి, ఓట్లపై కన్నేసి పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని పాలకపక్షం తహతహ లాడుతున్నది. ఈ నేపథ్యంలో సమావేశాలు ఎలా సాగుతాయో వేచిచూడాల్సిందే.
చివరి సమావేశాలు సాగేదెలా?!
Published Wed, Feb 5 2014 3:58 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement