యూపీఏ తక్షణమే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం తక్షణమే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి అని బీజేపీ అధికార ప్రతినిధి అరుణ్‌జైట్లీ అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చేందుకు మేం ఎదురు చూస్తున్నాం అని జైట్లీ తెలిపారు. గత పదేళ్లుగా తెలంగాణ విషయాన్ని యూపీఏ ప్రభుత్వం నాన్చుతోందని ఆయన విమర్శించారు.
గత దశాబ్ద కాలంగా తెలంగాణపై యూపీఏ పిల్లిమొగ్గలేస్తుందని, బీజేపీ తెలంగాణకు కచ్చితంగా మద్దతిస్తుంది. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నాం. రెండు ప్రాంతాలను సమన్వయపరచడంలో యూపీఏ ఘోరంగా విఫలమైంది అని జైట్లీ వ్యాఖ్యానించారు.
'ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలకు కేవలం ఆరు రోజులే మిగిలున్నాయి. బిల్లును ఇంకా ప్రవేశపెట్టలేదు. ఏ సభలో ప్రవేశపెట్టాలన్న విషయంపై చివరిదాక స్పష్టత లేదు' అని ఆయన అన్నారు. అసలు తెలంగాణ బిల్లు రాజ్యంగ బద్ధంగా, న్యాయపరంగా ఉందా అనేదానిపై అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయన్నారు.