విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లును లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వం ఆమోదించడంతో విశాఖ జిల్లా భగ్గుమంది. నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్రం కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజానీకం రగిలిపోయింది. యూపీఏ చర్యలను నిరసిస్తూ ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ పక్షాలు చేపట్టిన కార్యక్రమాలతో జిల్లా హోరెత్తిపోయింది. ప్రతి చోటా సోనియా దిష్టిబొమ్మల దహనాలు.. కాంగ్రెస్, బీజేపీ జెండాలు, హోర్డింగ్‌ల దహనాలు.. రాస్తారోకోలు.. ధర్నాలతో ప్రశాంత విశాఖ మంగళవారం సాయంత్రం నుంచి అగ్నిగుండంగా మారింది. లోక్‌సభలో మధ్యాహ్నం 3.30కు తెలంగాణ
బిల్లును ఆమోదించినట్టు వార్తలు వచ్చిన వెంటనే అన్ని పక్షాలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టాయి.
జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ సోనియా గాంధీ, షిండే, ఇతర కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర విభజనకు ఆమోదం లబించడంతో మనస్తాపానికి గురైన ఒక న్యాయవాది ఆ మంటల్లో దూకడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న మిగిలిన న్యాయవాదులు ఆయనను అడ్డుకొని అక్కడ నుంచి తీసుకువెళ్లారు. దీంతో కొంత సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న నరేంద్రమోడీ హోర్డింగ్‌ను న్యాయవాదులు చింపి దగ్ధం చేశారు.
సిరిపురంలో జంక్షన్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అక్కడున్న
రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కటౌట్లను చింపివేశారు.
ఆంధ్రా యూనివర్సిటీలో గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు లగుడు గోవింద్ ఆధ్వర్యంలో విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఏయూ లైబ్రరీ వద్ద భారీగా విద్యార్థులు రాస్తారోకో చేశారు.
మద్దిలపాలెం జంక్షన్‌లో ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకులు రాస్తారోకో నిర్వహించి 5 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.
మద్దిలపాలెం జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని మంగళవారం మంత్రి గంటా శ్రీనివాస్ ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడడంతో వైఎస్సార్ సీపీ నాయకులు విగ్రహాన్ని బలవంతంగా ఆవిష్కరించారు. అనంతరం అక్కడే కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ మల్కాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ సమన్వయకర్త దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు.
శ్రీహరిపురంలో తెలుగుదేశం నాయకులు రాస్తారోకో చేశారు.
అనకాపల్లిలో మంత్రి గంటా శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో అతని అనుచరులు కాంగ్రెస్ జెండాలను దహనం చేశారు.
అనకాపల్లిలో నెహ్రౌచౌక్ వద్ద తెలుగుదేశం నాయకులు కేంద్రం దిష్టిబొమ్మను తగలబెట్టారు.
నెహ్రౌచౌక్ దగ్గర వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు.
వడ్డాదిలో జేఏసీ నాయకులు సోనియాగాంధీ, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై శాపనార్థాలు పెడుతూ కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా వీధుల్లో ర్యాలీ చేశారు. నాలుగురోడ్ల జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.
భగ్గుమన్న జనం
Published Wed, Feb 19 2014 5:44 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement