వైఎస్సార్సీపీనీ పిలవండి
అఖిలపక్ష సమావేశాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని అఖిలపక్ష సమావేశాలకు ఇతర పార్టీలతో సమానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమను అఖిలపక్ష సమావేశానికి పిలవకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీని అఖిలపక్ష సమావేశాలకు పిలవలేదని... భవిష్యత్తులో జరిగే సమావేశాలకు తమను కూడా ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరి పారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చిత్తరవు నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ... కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించేందుకు ప్రభుత్వం ఇటీవల అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ మినహా మిగతా అన్ని పార్టీలను ఆహ్వానించిందని న్యాయమూర్తికి వివరించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీని విస్మరించిందని.. దీనిపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలసినా ప్రయోజనం లేకపోయిందని నివేదించారు.
తెలంగాణలో వైఎస్సార్‌సీపీకి నాయకులున్నారని, పెద్ద సంఖ్యలో కేడర్ ఉందని... కొత్త జిల్లాల విషయంలో ప్రజల తరఫున సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేసే అధికారం రాజకీయ పార్టీగా తమకుందని వివరించారు. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మరో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని.. అందువల్ల తమ పార్టీని భవిష్యత్తులో జరిగే అఖిలపక్ష సమావేశాలకు ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించారు. ఇతర పార్టీల్లాగానే వైఎస్సార్‌సీపీని కూడా అఖిలపక్ష సమావేశా లకు ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కేసీఆర్‌కు చెంపపెట్టు: వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీని అఖిలపక్ష సమావేశాలకు ఆహ్వానించాలంటూ హైకోర్టు వెలువరించిన తీర్పు సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఓటుతో టీఆర్‌ఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందిన విషయాన్ని కే సీఆర్ మర్చిపోయారని వ్యాఖ్యానించారు. తాము నమ్మకంగా వ్యవహరిస్తే కేసీఆర్ మాత్రం అఖిలపక్షానికి అన్ని పార్టీలను పిలిచి, వైఎస్సార్‌సీపీని విస్మరించి నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని విమర్శించారు.