కొత్త జిల్లాలపై అఖిలపక్షం: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా జిల్లాలు ఏర్పాటుచేయాలని కోరారు. జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక, అవసరాలు, జనాభా, వనరులు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ప్రజా ప్రతినిధులతో, అఖిలపక్ష నేతలతో చర్చించాలని డిమాండ్ చేశారు. కేవలం టీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తామంటే ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు.
హాకీ ప్లేయర్‌పై చర్య: ఆరేపల్లి
ఎస్సీ కులం అంటూ తప్పుడు పత్రాలతో మోసగించిన హాకీ ప్లేయర్ ముఖేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ డిమాండ్ చేశారు. ముఖేశ్ కులంపై అప్ప టి కలెక్టర్ విచారణ జరిపారని, బీసీ వర్గానికి చెందిన ముఖేశ్‌కుమార్ ఎస్సీని అం టూ తప్పుడు పత్రాలతో మోసం చేశాడని తేల్చినట్టుగా మోహన్ చెప్పారు.