హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాతిపదికన, ఏయే అంశాలను పరిగణలోనికి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లాల ఏర్పాటు విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేయడానికి ముందు సీఎం కేసీఆర్.. ప్రజాప్రతినిధులతో, అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వనరులు, సాగునీటి అంశాలు, రవాణా వసతులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోని పరిపాలన సౌలభ్యం, ప్రజలకు వ్యవస్థ అందుబాటులో ఉండేలా జిల్లాల ఏర్పాట్లు ఉండాలని మల్లు సూచించారు.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాట్ల అంశాన్ని ముందు పెట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో కరువు నివారణ చర్యలపై సమీక్షించాలని కోరారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి జిల్లాల ఏర్పాట్ల విషయాన్ని వివాదాలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూడాలని మల్లు రవి సూచించారు.
'ఏ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు'
Published Mon, May 23 2016 4:31 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement
Advertisement