నారాయణపేటలో నవశకం | New Era For Narayanpet | Sakshi
Sakshi News home page

నారాయణపేటలో నవశకం

Published Mon, Feb 18 2019 10:17 AM | Last Updated on Mon, Feb 18 2019 10:17 AM

New Era For Narayanpet - Sakshi

కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న జెడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యేలు

ఏళ్ల నాటి కల ఫలించింది.. అందరితో పాటు తమ ప్రాంతం జిల్లాగా మారలేదన్న బెంగ ఇన్నాళ్లు వెంటాడినా ఇప్పుడు అది సాకారం కావడంతో నారాయణపేట వాసుల్లో సంబరాలు మిన్నంటాయి.. కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లా ఆదివారం ఉదయం మనుగడలోకి వచ్చింది.. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీగా రొనాల్డ్‌రోస్, రెమారాజేశ్వరి బాధ్యతలు స్వీకరించగా.. జెడ్పీ చైర్మన్‌ భాస్కర్, నారాయణపేట, కొడంగల్, మక్తల్, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రాంమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని కార్యాలయాలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ‘పేట’లో పండగ వాతావరణం నెలకొంది.

నారాయణపేట: వలసలకు మారుపేరుగా.. అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న నారాయణపేటలో నవశకం ఆరంభమైంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన నూతన జిల్లాగా నారాయణపేట మనుకగడలోకి వచ్చింది. ఈ మేరకు కలెక్టరేట్‌ను ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఇన్‌చార్జి కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, ఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ రెమా రాజేశ్వరిలు జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, నారాయణపేట, మక్తల్, కొడంగల్, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు ఆయా కార్యాలయాల ముందు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సందడి వాతావరణం నెలకొనగా జిల్లా కేంద్రానికి చెందిన ప్రజలు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, మార్కెట్‌ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజు, నారాయణపేట ఎంపీపీ మణెమ్మ, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాసులుతో పాటు వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. కాగా, జిల్లా ప్రారంభానికి సూచకగా పలువురు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్కులు అందజేశారు.

ప్రజల వద్దకు పాలన
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రజల వద్దకు ప్రభుత్వ పాలనను అందించాలనే సంకల్పంతోనే నారాయణపేట కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న నారాయణపేట, కొడంగల్, మక్తల్‌ నియోజకవర్గాలు అభివృద్ధికి అమడదూరంలో నిలిచిపోయాయి. సాగునీటికి నోచుకోలేని ప్రాంతాలు. కేసీఆర్‌ జన్మదిన కానుకగా ఇచ్చిన జిల్లాను అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతాం. చెరువులకు సాగునీరు అందించి ఈ ప్రాంతం పచ్చదనంతో నిండిపోయేలా కృషి చేస్తాం
– పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొడంగల్‌

వలసలు ఆగిపోవాలి
నారాయణపేట నూతన జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. కొత్త జిల్లాలో కొత్త సర్పంచ్‌లు అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. మహబూబ్‌నగర్‌ జిల్లా అంటేనే వలసలకు పెట్టింది పేరు కాగా.. నారాయణపేట డివిజన్‌ నుంచే అధికంగా వలసలు వెళ్లారని చెబుతారు. ఇకపై నూతన జిల్లా ఏర్పాటుతో వలసలు అగిపోవాలి. అభివృద్ధిలో దూసుకెళ్లి నారాయణపేటకే వలసలు వచ్చేలా పనిచేయాలి. చేనేత జిల్లా కార్యాలయాల ఏర్పాటుతో కార్మికుల కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వరకు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నందున సర్పంచ్‌లు చొరవ చూపాలి.  
– రొనాల్డ్‌రోస్, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌  

 అన్ని రంగాల్లో అభివృద్ధి..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన నారాయణపేట జిల్లా పుట్టింది. కొత్త జిల్లాగా ఏర్పాటైన నారాయణపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశముంది. అప్పుడే పుట్టిన బిడ్డను ఎలా తీర్చిదిద్దుకుంటామో జిల్లాను కూడా అలాగే చూసుకోవాలి. ప్రజల సహకారంతో ముందుకు సాగుతూ జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తాం. ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం ద్వారా ఎలాంటి నేరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తాం. వెనకబడిన నారాయణపేట జిల్లాలో ఇకపై ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశముంది.  
– రెమా రాజేశ్వరి, ఇన్‌చార్జ్‌ ఎస్పీ

 కేసీఆర్‌ జన్మదినం... జిల్లాకు శుభదినం 
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజున నారాయణపేట జిల్లా ఏర్పాటుకావడం ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు శుభదినం. గతంలో జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడే నారాయణపేట జిల్లా కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో జరగలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నారాయణపేట జిల్లా ప్రజలకు జిల్లాను కేసీఆర్‌ వరంగా ఇచ్చారు. ఇది చరిత్రలో నిలిపోయే దినం. ఇకపై నారాయణపేట భవిష్యత్‌ మారిపోతుంది. నారాయణపేటకు వచ్చేందుకు ఉద్యోగులు దూరంగా భావించొద్దు. కలెక్టర్‌ తమిళనాడు నుంచి, ,ఎస్పీ కేరళ నుంచి వచ్చి పనిచేస్తున్నప్పుడు నారాయణపేట ఏమీ దూరం కాదు. పాకిస్తాన్‌ బార్డర్‌కు వెళ్లడం లేదు కదా(నవ్వుతూ)?. ఉద్యోగులు సమష్టి కృషితో అభివృద్ధిలో జిల్లాను పరుగులు తీయించాలి.
– బండారి భాస్కర్, జెడ్పీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement