నాలుగు జిల్లాలకు పాత కలెక్టర్లు, ఎస్పీలే!
- నియామకాలపై కసరత్తు చేసిన సీఎం కేసీఆర్
- చిన్న జిల్లాల్లో జూనియర్‌లకు అవకాశమివ్వాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కసరత్తు చేశారు. మొత్తంగా 31 జిల్లాలుండగా ఐదారు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలను నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పెద్ద జిల్లాలకు ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలనే కొనసాగించాలని.. చిన్న జిల్లాలకు మాత్రం జూనియర్ అధికారులను కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించాలని భావిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, ఆదిలాబాద్ కలెక్టర్ జగన్‌మోహన్‌రావు, నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణాలను.. తిరిగి ఆయా జిల్లాల కలెక్టర్లుగానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి, నల్లగొండ కలెక్టర్‌గా ఆ జిల్లా ప్రస్తుత జేసీ సత్యనారాయణరెడ్డి, మేడ్చల్ కలెక్టర్‌గా ఎంవీ రెడ్డిలను నియమించనున్నారని తెలిసింది.