'జిల్లాల పెంపుతో ఒక్క పైసా రాదు'
హైదరాబాద్ : రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా అదనంగా నిధులు రావని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి స్పష్టంచేశారు. వివిధ పథకాలకు ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా కేంద్రం, ప్లానింగ్ కమిషన్ నిధులు ఇస్తాయే తప్ప జిల్లాలను బట్టి ఇవ్వదన్నారు.
హైదరాబాద్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొత్త జిల్లాలు ఏర్పడితే అదనంగా నిధులు వస్తాయంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి వివరణనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రజలను మభ్యపెట్టడానికి, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు తప్ప దీనివల్ల ప్రజలకు రాష్ట్రానికి జరిగే మేలు ఏమీ లేదని ధ్వజమెత్తారు.
కేబినెట్ సమావేశం తర్వాత కూడా జిల్లాలపై స్పష్టతనివ్వకుండా గోప్యంగా పెట్టి ప్రజలను మభ్యపెట్టడం క్రిమినల్ ఆలోచనలు, క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనమని విమర్శించారు. దసరా వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మభ్యపెట్టాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలనకు అవసరమైన ఐఏఎస్ అధికారులను కేంద్రం ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారని, ఇప్పుడెలా చేస్తారన్నారు.
రైతులకు తగిన మార్కెటింగ్ సౌకర్యాలు, వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమం, సక్రమంగా విద్య,వైద్య సదుపాయాలు అందిస్తే వాటికోసం కలెక్టర్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కింద 30,40 విభాగాలు,శాఖలకు అధికారులను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. కొత్తగా నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని, అసలు దీనిపై ప్రభుత్వానికి ఏమైనా అవగాహన ఉందా అని నిలదీశారు. వీటి కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు.