కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన కేసీఆర్
వరంగల్: జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విదానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకుంటోన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రతిదానికి అడ్డుచెబుతున్నారని దుయ్యబట్టారు. వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారికి స్వర్ణకిరీటాన్ని బహూకరించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
'ఇష్టారీతిగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేశామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇలా మాట్లాడేటప్పుడు ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏడాది కిందటే సీఎస్తో ప్రత్యేక కమిటీని వేశాం. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజను కూడా దృష్టిలో ఉంచుకుని ఆమేరకు జిల్లాలను రూపొందించాం. అయినా సరే ఇంకొందరు శాస్త్రీయంగా జరగలేదంటున్నారు. నాకు తెలియక అడుగుతున్నా.. వాట్ ఈస్ శాస్త్రీయత? అదేంటో మాట్లాడేవాళ్లు చెప్పాలి కదా? ఇంకా ముఖ్యమైన విషయమేమంటే.. జిల్లాల ఏర్పాటుపై అసలు కాంగ్రెస్ వాళ్లకే ఏకాభిప్రాయం లేదు. ఒక్కొక్కరు ఒక్కో జిల్లా కావాలని డిమాండ్ చేస్తున్నరు. తీరా వాళ్లు అడిగినవన్నీ ఇచ్చేసరికి మళ్లీ గుండెలు బాదుకుంటున్నరు' అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. భూస్వామ్య, సామ్రాజ్యవాద భావజాలం ఉన్నవారే జిల్లాల అంశంపై ఇంకా ధర్నాలు చేయిస్తున్నారని, తెలంగాణ వచ్చుడే దురదృష్టం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలివితక్కువ ఎత్తుగడలు
ప్రభుత్వ వ్యతిరేక ఎత్తుగడల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని సీఎం కేసీఆర్ అన్నారు. 'ఒకవైపు రాష్ట్రమంతటా విస్తారంగా వానలు కురిసి, రైతులంతా సంతోషంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ రైతు ఎజెండాతో పోరాటం చేస్తామంటున్నారు. ఇంతకంటే తెలివి తక్కువ ఎత్తుగడ ఉంటుందా? 60 ఏళ్ల పాలనలో ఏమీ చెయ్యని కాంగ్రెసోళ్లు.. 'మీరు కూడా ఏం చేయకుండానే ఉండాల'నే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇక సీపీఎం పార్టీ ఐదు నెలల పాటు నిరసన యాత్రలు చేస్తుందట! అదేమి యాత్రో ఎవ్వరికీ అంతుపట్టడంలేదు' అని కేసీఆర్ మండిపట్టారు.