రాష్ట్రంలో తుగ్లక్ పాలన : వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో తుగ్లక్ పాలన : వైఎస్సార్సీపీ
Published Sat, Oct 8 2016 4:26 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హైదరాబాద్ : పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తుగ్లక్ పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు జరపకుండానే కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే పరిపాలన ఏ విధంగా సాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాగ్థానాలు ఒకటి కూడా పూర్తిగా పరిపూర్ణంగా నెరవేర్చక పోవటం దారుణమన్నారు.
శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చట్టబద్ధత లేకుండా జిల్లాలు తనంతకు తాను పెంచటం సరైందికాదని పేర్కొన్నారు. దసరా పండుగ పర్వదినాన జిల్లాల ప్రారంభం పెట్టుకుని ఉద్యోగులను కుటుంబసభ్యులందరూ కలిసి నిర్వహించుకునే పండుగకు దూరం చేయటం సరైందికాదని హితవు పలికారు. పర్వదినం రోజున ఉద్యోగులపై పనిభారం పెట్టడం తగదన్నారు. పరిపాలన కోసం జిల్లాలు పెంచటం మంచిదే అయినా... అది శాస్త్రీయంగా లేకపోవటం గురించే తమ పార్టీ స్పందిస్తుందని తెలిపారు. రెవిన్యూ డివిజన్ కంటే తక్కువ పరిధిలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే అక్కడ ఐఏఎస్‌లు ఎలా పని చేస్తారని అడిగారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నెలన్నర తర్వాత అధికారులను అధ్యయనం కోసం ఇతర రాష్ట్రాలకు పంపటం ఎంత మాత్రం సమంజసంగా లేదన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఎంతమాత్రం లేదని చెప్పారు. గద్వాల జిల్లాను జొగులాంబ జిల్లాగా ప్రకటిస్తూ, అలంపూర్ మండలాన్ని వనపర్తి జిల్లాలో చేర్చటం ఏంటన్ని, ఇదేమి శాస్త్రీయత అని ప్రశ్నించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పెట్టని గద్వాల, జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌లను జిల్లాలుగా ప్రకటించారన్నారు.
నారాయణ్‌పేట్‌ను జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాజీనామా సీఎంకు రాజీమానా సమర్పించారు. ములుగును జిల్లాగా ప్రకటించాలని మంత్రి అజ్మీరా చందులాల్ డిమాండ్ చేస్తున్నారు. ఇంక్కెన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. నాలుగు జిల్లాల ఏర్పాటుపై కె. కేశవరావుతో హైపర్ కమిటీ అని ఒకదానిని ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ నివేదిక సమర్పించక ముందే సీఎం గద్వాల, జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌లను జిల్లాలుగా ప్రకటించారన్నారు. ఇది హైపవర్ కమిటీనా హైడ్రామా కమిటీ అనుకొవాలా అని ఆయన ప్రశ్నించారు. డ్రాఫ్ట్ ప్రకటించిన 27 జిల్లాలు ఎక్కడా సీఎం ప్రకటించిన 31 ఎక్కడన్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరగడంపై ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారని శివకుమార్ చెప్పారు.
Advertisement