రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి  | All-Party demand To Telangana Govt | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి 

Published Thu, Apr 16 2020 2:54 AM | Last Updated on Thu, Apr 16 2020 2:54 AM

All-Party demand To Telangana Govt  - Sakshi

బుధవారం అఖిలపక్ష సమావేశంలో కోదండరాం, చాడ, ఉత్తమ్, రమణ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: గత 23 రోజులుగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (టీపీసీసీ అధ్యక్షుడు), వి. హనుమంతరావు (మాజీ ఎంపీ), ఎం.కోదండరాం (టీజేఎస్‌ అధ్యక్షుడు), చాడా వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు), ఎల్‌.రమణ (టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయా పార్టీల నేతలు చర్చించారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రజలకోసం కష్టపడుతున్న వైద్య శాఖ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కొన్నిరోజుల లాక్‌డౌన్‌కే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కోత పెట్టడమేంటని, పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలు, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకుంటున్న నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరికి సంబంధించిన విషయంలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించేందుకు సీఎం కేసీఆర్‌ ఎందుకు ముందుకు రావడం లేదని, వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ముందు జాగ్రత్త చర్యలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశం అనంతరం అన్ని పార్టీల నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా నేతలు వ్యక్తపరిచిన అఖిలపక్షం డిమాండ్లివే: 

► రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. 
► రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించినందున గతంలో పేదలకు ప్రకటించిన బియ్యం, నగదు సాయానికి అదనంగా రెండో విడత ప్యాకేజీ ప్రకటించాలి.  
► వలస కార్మికులకు వీలున్నంత సాయం అందించాలి. వారు స్వగ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.  
► కరోనా చికిత్సల కోసం గాంధీతో పాటు పలు ఆసుపత్రులను వినియోగించుకోవాలి. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ కోసం ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించాలి.  
► బియ్యం, నగదు సాయాన్ని తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. రేషన్‌ కార్డులు లేని వారికి కూడా సాయం చేయాలి.  
► పసుపు, బత్తాయి, మిర్చి, మామిడి, కంది పంటలను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలి.  
► ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూ లీ పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.  
► రాబోయే 2 నెలలకు పేదలకు కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించాలి.  
► వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలు, పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement