విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధి, ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వివిధ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి దృష్టికి తెచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీ సోదరుల్లో అభద్రతకు కారణమైన ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పామని మిథున్‌రెడ్డి తెలిపారు. వీటిపై సభలో చర్చ కోసం పట్టుబడతామని స్పష్టం చేశారు.
ప్రధాని దృష్టికి తెచ్చిన అంశాలు ఇవీ...
– రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్లకు సంబంధించి ఇంకా రావాల్సిన రూ.18,969 కోట్లు ఇవ్వాలి.
– ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. కేబీకే– బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రూ. 350 కోట్లు చెల్లిస్తోంది. అంచనాలను సవరించి రూ. 24,350 కోట్లు ఇవ్వాలి. ఇప్పటివరకు ఇచ్చిన నిధులు తీసేయగా మిగిలిన రూ. 23,350 కోట్లు ఇవ్వాలి.
– జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు రూ.11,860 కోట్లు వెచ్చించింది. ఇందులో ఇంకా రూ.3,283 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది.
– ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లు కాగా సాంకేతిక సలహా కమిటీ దీన్ని క్లియర్ చేసింది. సవరించిన వ్యయ అంచనాల కమిటీ ఆమోదించాల్సి ఉంది. దీన్ని త్వరితగతిన పరిష్కరించాలి
– రాజధాని నిర్మాణ అవసరాల కోసం రూ.49,924 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం ఇప్పటివరకు రూ.2,500 కోట్లు ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాలి.
– దుగరాజపట్నం పోర్టుకు వాణిజ్య యోగ్యత లేదని కేంద్రం చెప్పినందున దానికి బదులుగా రామాయపట్నం పోర్టు కోసం ఆర్థిక సాయం అందించాలి.
– కడపలో స్టీల్ ప్లాంట్‌కు నిధులు మంజూరు చేయాలి.
– విభజన చట్టం ప్రకారం ఏపీకి పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించాలి. పదేళ్లపాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, పదేళ్లపాటు ఆదాయపన్ను మినహాయింపు, వందశాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రాయితీ, 20 శాతం రవాణా వ్యయం, 3.6 శాతం పీఎఫ్ చందా తదితర వెసులుబాట్లు కల్పించాలి.
– కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన రూ. 5,834 కోట్లు విడుదల చేయాలి.
ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకిస్తాం
సాక్షి న్యూఢిల్లీ, పీలేరు (చిత్తూరు జిల్లా): ‘సీఏఏ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత మైనారిటీ సోదరుల్లో అభద్రత నెలకొంది. ఎన్‌ఆర్సీ గానీ, ఎన్‌పీఆర్‌గానీ కచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలిపాం. దీనిపై చర్చ జరగాలని కోరాం. ఈరోజు అనిశ్చితి ఎందుకు నెలకొంది? ఎలా తొలగించాలన్న అంశంపై చర్చ జరగాలని మేం పట్టుబట్టాం. ఇదే అంశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి దృష్టికి కూడా తెచ్చాం. మైనారిటీ సోదరుల తరపున ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లను మేం కచ్చితంగా వ్యతిరేకిస్తాం. మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల కోసమని సీఏఏ బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజు దేశంలో మైనారిటీలంతా అభద్రతా భావానికి లోనయ్యారు. సీఏఏ ప్రవేశపెట్టిన తీరు వేరు ఈరోజు అమలు చేస్తున్న తీరు వేరు. మైనారిటీ సోదరులకు వ్యతిరేకంగా ఉండే ఏ బిల్లునైనా వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే చెప్పారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్ వల్ల మైనారిటీ సోదరుల్లో నెలకొన్న అభద్రత తదితర అంశాలన్నీ చర్చకు రావాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కోరా. సభాపతి వీటిని నమోదు చేసుకున్నారు’ అని మిథున్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment