రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులతో వర్చువల్‌గా మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వినతులు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వర్చువల్‌గా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పది ప్రధాన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం వీటి పరిష్కారానికి ప్రధాని ఏర్పాటు చేసిన కమిటీతో రాష్ట్ర బృందం భేటీ అయిందని తెలిపారు.
ఈ భేటీలో కేంద్ర బృందం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా బడ్జెట్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు పదేపదే వాయిదా పడకుండా సజావుగా, ఎక్కువ సమయం జరగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు వివరించారు. సమావేశాలను అడ్డుకొనే వారిపై క్రమశిక్షణ వేటు వేయాలని అన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్‌ఐసీ, బీపీసీఎల్, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని కోరారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ నష్ట పరిహారం మరో ఐదేళ్లపాటు పొడిగించి ఆదుకోవాలన్నారు. మధ్య తరగతి ప్రజలకు స్వల్ప మొత్తంలో ఆరోగ్య బీమా అందించాలన్నారు. సుమారు 56 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆరోగ్య బీమా లేకుండా ఉన్నారని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ తక్షణమే చేపట్టి, కులాలవారీగా గణన చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని 10 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. నిర్ణీత కాల వ్యవధిలో నియామకాలు పూర్తి చేసేలా యూపీఎస్సీ తరహాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్‌ఆర్‌బీకి సైతం చట్టబద్ధత కల్పించాలని విజయసాయిరెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment