అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి డిమాండ్
ఏపీలో దారుణంగా శాంతిభద్రతలు
ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి
టీడీపీకి ఏ మాత్రం పాలించే అర్హత లేదు.. మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాజ్యసభ, లోక్‌సభ పక్ష నేతలు వి.విజయసాయిరెడ్డి, పి.మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వారిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లో అదుపు తప్పిన శాంతి భద్రతలు, అధికార పార్టీ దాడులు, విభజన హామీల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఎంపీలకే రక్షణ లేని దుస్థితి..
ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ సభ్యులకు సైతం భద్రత లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాదాపు 500 మందితో వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారన్నారు. దాడులకు బరి తెగించిన టీడీపీ గూండాలను వదిలేసి వైఎస్సార్ సీపీకి చెందిన బాధితులపై నే కేసులు బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సాగించేందుకు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అర్హత లేదని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు.
రాష్ట్రంలో 45 రోజుల టీడీపీ పాలనలో 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ఆస్తులపై దాడులు జరిగాయన్నారు. యథేచ్ఛగా హత్యలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై వేలాదిగా దాడులు జరిగాయన్నారు. టీడీపీ గూండాలు వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇలాంటి వాళ్లా రాష్ట్రాన్ని పాలించేది? అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 300 హత్యాయత్నాలు జరిగాయంటే ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో ఊహించవచ్చన్నారు.
మౌనపాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే బుధవారం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరిగిందో ఫోటో ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధితో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల అపాయింట్‌మెంట్లు కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కేంద్రం, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు.
అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా, బడ్జెట్‌లో ఎక్కువ వాటా, విభజన హామీల్లో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న పెట్రో కెమికల్, రైల్వే జోన్, గిరిజన వర్సిటీ తదితర అంశాలపై డిమాండ్ చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరగా మరో కీలక భాగస్వామి టీడీపీ మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు.
మాపై దాడి చేసి.. మాపైనే కేసులా?
రెండుసార్లు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమైనా టీడీపీ గూండాలు అడ్డుకుని భౌతిక దాడులకు దిగినట్లు ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. గృహ నిర్భంధం విధించి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి వాహనాలను దగ్ధం చేస్తే హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు తమపై బనాయించడం దారుణమన్నారు.
ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. వినుకొండలో రషీద్‌ది రాజకీయ హత్య అని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment