Parliament: లోక్‌సభకు పొగ | Parliament: Smoke canister strike by two visitors sets off chaos in Lok Sabha | Sakshi
Sakshi News home page

Parliament: లోక్‌సభకు పొగ

Published Thu, Dec 14 2023 3:58 AM | Last Updated on Thu, Dec 14 2023 8:38 AM

Parliament: Smoke canister strike by two visitors sets off chaos in Lok Sabha - Sakshi

కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్‌ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్‌ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవా’లని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చి న పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు.

చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు.  అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు తేల్చారు. సరిగ్గా 22 ఏళ్ల కింద పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచిన రోజే జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. దీనిపై పార్టీలకతీతంగా ఎంపీలు, నేతలు ఆందోళన వెలిబుచ్చారు. సభలోకి దూకిన వారు మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్‌ సింహ సిఫార్సుతో విజిటర్స్‌ గ్యాలరీ పాస్‌ సంపాదించినట్టు తేలింది.

సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం. ఒంటి గంట సమయం. లోక్‌సభలో జీరో అవర్‌ ముగింపుకు వచ్చింది. బీజేపీ సభ్యుడు ఖగేన్‌ ముర్ము మాట్లాడుతుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం! ఏమైందో అర్థం కాక లోక్‌సభ సభ్యులంతా ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఎవరో సభలోకి పడిపోయారని తొలుత భావించారు. అదేమీ కాదని, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సభలోకి దూకాడని అర్థమై బిత్తరపోయారు.

ఆలోపే మరో వ్యక్తి కూడా సభలోకి దూకి మరింత కలకలం రేపాడు. ఇద్దరూ బెంచీలపై గెంతుతూ స్పీకర్‌ను చేరుకునేందుకు వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బూట్లలోంచి పొగ గొట్టాలు తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పొగ హాలంతటా కమ్ముకుంది. ఈ పరిణామాలతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు లోనై అటూ ఇటూ పరుగులు తీశారు.

చివరికి ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణం బయట కూడా పొగ గొట్టాలు విసిరి కలకలం రేపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 2001లో సరిగ్గా డిసెంబర్‌ 13వ తేదీనే పాకిస్తాన్‌లోని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంపై దాడికి తెగబడి విచ్చలవిడి కాల్పులతో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. తాజా ఉదంతంపై కేంద్ర హోం శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది.

తీవ్ర భద్రతా లోపం: ఎంపీలు
ఘటన అనంతరం మధ్యాహ్నం రెండింటికి లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. 2001 దాడి అనంతరం ఇది అతి తీవ్రమైన భద్రతా లోపమంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతానంటూ ఖలీస్థానీ వేర్పాటువాది గురుపర్వత్‌ సింగ్‌ పన్ను హెచ్చరించిన విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు.

మొదటి వ్యక్తి తన సమీపంలోనే సభలోకి దూకాడని జేడీ(యూ) ఎంపీ రామ్‌ప్రీత్‌ మండల్‌ చెప్పారు. తామంతా తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశామన్నారు. వాళ్ల దగ్గర బాంబు, మారణాయుధాలుంటే పరిస్థితేమిటని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

సభను వాయిదా వేసి ఈ ఉదంతంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్రం తక్షణం క్షమాపణ చెప్పాలని, పార్లామెంటు భద్రతను తక్షణం మరింత కట్టుదిట్టం చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. దుండగులకు పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ సింహాను విచారించాలన్నారు. ఆయన్ను తక్షణం సభ నుంచి బహిష్కరించాలని తృణమూల్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు.

ఇలా జరిగింది...
సభలోకి దూకి కలకలం రేపిన వారిని కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.మనోరంజన్‌ (34), యూపీలోని లక్నోకు చెందిన సాగర్‌ శర్మ (26)గా గుర్తించారు. జీరో అవర్‌ కాసేపట్లో ముగుస్తుందనగా ముందుగా సాగర్‌ ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. దాంతో ఎంపీలు షాక్‌కు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆరెల్పీ ఎంపీ హనుమాన్‌ బెనీవాల్‌ అతన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తుండగానే మరో వ్యక్తి కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. ఇద్దరూ వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తిని బెనీవాల్‌ తదితర ఎంపీలు పట్టుకుని దేహశుద్ధి చేశారు.

నియంతృత్వం చెల్లదని అతను నినాదాలు చేశాడు. ‘‘దగ్గరికి రావద్దు. మేం దేశభక్తులం. నిరంకుశత్వంపై నిరసన తెలపడానికే వచ్చాం’’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇద్దరూ తమ బూట్ల నుంచి పొగ గొట్టం వంటివాటిని తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పసుపు రంగు పొగ సభ అంతటా వ్యాపించడంతో ఎంపీలంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తర్వాత ఎంపీలంతా కలిసి వారిని నిర్బంధించారు. బాగా దేహశుద్ధి చేసి పార్లమెంటు సిబ్బందికి అప్పగించారు. వెంటనే సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.

సభలో లేని మోదీ, అమిత్‌ షా
ఘటన జరిగినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మంత్రులు ప్రహ్లాద్‌ జోషీ, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌తో పాటు కాంగ్రెస్‌ సభ్యులు రాహుల్‌ గాందీ, అదీర్‌ రంజన్‌ చౌధరి సహా మొత్తం 100 మందికి పైగా ఎంపీలు సభలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లేరు.

ఆరుగురూ ఒకే ఇంట్లో...
పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్‌ (42), మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమోల్‌ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్‌లకు లలిత్, విశాల్‌ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విశాల్‌ను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్‌ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో లలిత్‌ ఇంట్లో నే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు 3  నెలలుగా పార్లమెంటు పాస్‌ల కోసం ప్రయతి్నస్తున్నట్టు విచారణలో తేలింది.

ఎవరీ సింహా?
దుండగులకు విజిటర్స్‌ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా మాజీ జర్నలిస్టు. కర్ణాటకలోని మైసూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాశారు. పార్లమెంటు కార్యకలాపాలు చూస్తామంటూ మనోరంజన్‌ పాస్‌లు తీసుకున్నట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఇలా నియోజకవర్గాల ప్రజలకు ఎంపీలు పాస్‌లు జారీ చేయడం మామూలేనంది. తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంటులోకి సందర్శకులకు పాస్‌ల జారీని నిలిపేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement