లోక్‌సభలో దాడి ఘటన.. పట్టుబడ్డ ఆగంతకుల నేపథ్యం ఇదే..! | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో దాడి ఘటన.. పట్టుబడ్డ ఆగంతకుల నేపథ్యం ఇదే!

Published Thu, Dec 14 2023 12:31 PM

Family Of Lok Sabha Security Breach Conspirator Qualified Jobless - Sakshi

లోకసభలోకి ఆరుగురు ఆగంతకులు చొరబడి సృష్టించిన అలజడి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కసారిగా సరిగ్గా అదే రోజు (2001 డిసెంబర్‌ 13)22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి యత్నించిన ఉదంతం కళ్లముందు మెదిలింది. అలాంటి ఉగ్రదాడేనా! అని అనుమానాలు లేవెనెత్తాయి. రెండు దశాబ్దాల కిందట జరిగిన దాడే మాయని మచ్చలా చాన్నాళ్లు వెంటాడింది. అది మరువక మునుపే కొత్తగా ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంటు వద్ద మళ్లీ అలాంటి కల్లోలం అందర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు ప్రాంగణం లేదా బయట వైపు కాకుండా ఏకంగా దిగువసభలోకే ఆగంతకులు చొరబడటం పార్లమెంట్‌లోని భద్రతా వైఫల్యం గురించి అనుమానాలు లేవనెత్తింది . అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త పార్లమెంట్‌ తీర్చిదిద్దిన విధానం గురించి ఎంతలా ప్రచారం చేశారో కూడా తెలిసిందే. ఈ కొత్త పార్లమెంట్‌ ప్రారంభమైంది కూడా ఈ ఏడాది మేలోనే, ఇంతలోనే ఈ దాడి అందర్నీ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ పార్లమెంట్‌లోకి చొరబడ్డ ఆ ఆగంతకుల్లో కొందరీ బ్యాగ్రౌండ్‌ మాములగా లేదు. వారి నేపథ్యం విని అధికారులే ఆశ్చర్యపోయారు. ఇంతటి ఉన్నత విద్యావంతులు ఇలాంటి దారుణానికి ఎందుకు దిగారంటే..

కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్‌ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్‌ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవాలని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చిన పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది.

వాళ్లెవరంటే..?
పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్‌ (42), మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమోల్‌ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్‌లకు లలిత్, విశాల్‌ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విక్కీ శర్మను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్‌ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో విక్కీ శర్మ ఇంట్లో నే ఉంటున్నట్టు విచారణలో తెలిసింది.

ఆగంతకుల బ్యాగ్రౌండ్‌...
పట్టుబడ్డ నిందుతుల్లో నీలమ్‌ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఎం.ఫిల్ పూర్తి చేసింది. అలాగే టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించే సెంట్రల్ ఎగ్జామినేషన్‌లో కూడా పాసయ్యింది. కానీ ఉద్యోగం లేదు. ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో నీలమ్‌ తీవ్ర డిప్రెషన్‌కి లోనయ్యినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చదువుకున్నా.. సరైన ఉద్యోగం లేదు రోజుకు రెండుపూట్ల తిండి కూడా తినలేకపోతున్నానని ఆవేదన చెందేదని, తరుచుగా చనిపోతానని ఏడ్చేదని నీలమ్‌ తల్లి చెబుతోంది. ఆమె సోదరుడు రామ్‌నివాస్‌ నీలమ్‌కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆమె ఎందుకిలా చేసిందనేది కూడా మాకు తెలియదు.

తమ బంధువులు ఫోన్‌ చేసి టీవి చూడమని చెప్పేంత వరకు తమకు దీని గురించి తెలియదని అన్నాడు. నీలమ్‌ పోటీపరీక్షలకు ప్రీపేర్‌ అయ్యేందకు హర్యానాలో జింద్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఆమె బీఏ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. పైగా నెట్‌లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాసయ్యింది. ప్రస్తుతం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు కూడా ప్రిపరవ్వుతుందని ఆమె కుటుంబసభ్యలు చెబుతున్నారు. కాగా నీలమ్‌ తరచూ నిరసనల్లో నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతుండేదని, పైగా మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సమీపంలో ఏడాదిపాటు జరిగిన రైతుల నిరసనలో కూడా పాల్గొన్నట్లు సమాచారం. 

ఇక మరో నిందితుడు మనోరంజన్(34) మైసూర్‌కి చెందినవాడు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌. అతడి తండ్రి దేవరాజేగౌడ మాట్లాడుతూ.. తన కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరి తీయాలని అన్నారు. పార్లమెంటు మాది... మహాత్మా గాంధీ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ వరకు చాలా మంది ఆ ఆలయాన్ని నిర్మించారు.. నా కొడుకు అయినా ఆ గుడి విషయంలో ఎవరైనా ఇలా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదు అని నిందుతుడి తండ్రి పేర్కొనడం గమనార్హం.

నీలం అజాద్‌తో కలసి పార్లమెంట్‌ వెలుపల పొగ గొట్టలు విసిరిన అమోల్‌ షిండే మహారాష్ట్రలోని లాతూర్‌​ గ్రామానికి చెందిన వాడు. అతడి తల్లిదండ్రులు కూలీలు. పోలీసు, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ వంటి పోటీ పరీక్షల్లో చాలా సార్లు విఫలమయ్యాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అతను పోలీస్‌​ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు.

అలాగే లక్నో నివాసి, సాగర్ శర్మ, అతనితో సహా అతని కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. శర్మ జీవనోపాధి కోసం ఇ-రిక్షా కూడా నడుపుతున్నాడు. నిరసనలో పాల్గొనేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీకి వెళతానని చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిగా ఆ నిందితులకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ అతడి భార్య రేఖను కూడా అదుపులో తీసుకున్నారు. విక్కీ ఎగుమతుల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారందరిపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్ట కింద కేసులు నమోదు చేశారు. 

ఆ ఆగంతుకులు ఒక్కొకరిది ఒక్కో నేపథ్యం. కానీ వారంతా ఎంతోకొంత చదువుకున్న వారు. సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు, ఏదీ మంచి ఏదీ చెడు తెలిసిన వివేకవంతులే. కానీ ఇలా తాము ఎదుర్కొన్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో తప్పుడు దోవ ఎంచుకున్నారో లేక మరేవరి ప్రమేయం లేదా ప్రభావం ఉందో తెలియదు గానీ చాలామంది యువత ఇలానే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అన్యాయమైపోయిన వాడు తనలా మరెవరు కాకుడదన్న మనస్తత్వంతో ఉండాలి. తనను నమ్ముకున్నవాళ్లు లేదా తనపై ఆధారపడిన వాళ్ల గురించి అయినా ఆలోచించాలి. ఇలాంటి మార్గంలో మాత్రం పయనించడు. దీన్ని యువత గుర్తించుకోవాలి. 

మన చుట్టు ఉన్నవాళ్లలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో పెరిగి నెగ్గుకొచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అంతెందుకు మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ ఎంతటి దారిద్యాన్ని అనుభవించాడో తెలిసిందే. ఆ రోజుల్లోనే అతను అందరికంటే ఉన్నత విద్యాను అభ్యసించాడు అయినా వెనుకబడి కులం వాడన్న ఒక్క కారణంతో  హేళనలకు గురిచేశారు. అంటరానివాడని అవమానించారు. కనీసం సాటి మనిషిలా కూడా గౌరవం ఇవ్వకపోయినా తట్టుకుని నిలబడి ఛీత్కారంతో చూసిన వారిచేత శభాష్‌ అని సలాం కొట్టించుకున్నాడు. ఇలాంటి ఎందరో మహనీయుల మన మాతృభూమికి మంచి పేరుతెచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశానికి యువత ఓ ఆయుధం. వారు దేశాన్ని అభివృద్ధిపథంలోకి నడిపించేలా ఉండాలి కానీ కానీ కళంకంలా ఉండకూడదు. కఠిన పరిస్థితులను తట్టుకుని రాటుదేలి.. మహనీయుడిలా మారాలే కానీ అలజడులు సృష్టించే ఉగ్రవాదులు లేదా నేరస్తులుగా మారకూడదు. 

(చదవండి: లోక్‌సభకు పొగ)

Advertisement
 
Advertisement
 
Advertisement