ఐక్య పోరుకు సిద్ధం | Sarpanch community roundtable meeting | Sakshi
Sakshi News home page

ఐక్య పోరుకు సిద్ధం

Published Sat, Nov 1 2014 4:17 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

Sarpanch community roundtable meeting

* పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదు
- స్థానిక సంస్థల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది..
* గత ప్రభుత్వాలకు పట్టిన గతే దీనికీ పడుతుంది..
- రౌండ్‌టేబుల్ సమావేశంలో సర్పంచ్‌ల సంఘం
* రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి

ఖమ్మం: బకాయిపేరుతో గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయటం సరికాదని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి అన్నారు. దీనిపై ఐక్యపోరాటాలకు సిద్ధమవ్వాలని సర్పంచ్‌లకు ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సిక్వెల్ రిసార్ట్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామన్న నాయకులు ఇప్పుడు విద్యుత్ బిల్లుల పేరుతో ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు. గత మూడేళ్లుగా విడుదల చేయని 13వ ఆర్థికసంఘం నిధులను ఇప్పుడు విడుదల చేస్తే..వాటిపై కన్నేసి ట్రాన్స్‌కో అధికారులు జీపీలపై పడుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకాల్లో జీపీలకు ఇచ్చిన అధికారాలనే ఇక్కడా ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి తోడు 20 శాతం టీఎఫ్‌టీ నిధులు అదనంగా కేటాయించాలని కోరారు.

ప్రభుత్వం కావాలనే పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సౌకర్యాలు కల్పించకపోగా భారాలు మోపడంపై కోర్టుకు వెళ్తామన్నారు. పంచాయతీలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. 15 ఏళ్ల బకాయిలను ఇప్పుడు చెల్లించాలని పంచాయతీలపై ఒత్తిడి తేవడం సరికాదని ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ అన్నారు. గ్రామపంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పల్లెలు అంధకారంలో కూరుకుపోయాయన్నారు. ప్రజలు పన్నులు కట్టే పరిస్థితుల్లో లేరన్నారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పంచాయతీల పరిరక్షణకు పాటుపడితే ఈ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందిపెట్టిన చంద్రబాబుకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. కరువు, విద్యుత్ కోతలతో గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన పాలకులు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి వాటిని శ్మశానాలుగా మారుస్తున్నారన్నారు. విద్యుత్ బకాయిలపై ప్రభుత్వం ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు కోరారు.

విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పంచాయతీల్లో ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గత బిల్లులతో సంబంధం లేకుండా జీపీలకు విద్యుత్ సరఫరా చేయాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి యర్రా శ్రీకాంత్ కోరారు. చిన్నచిన్న పంచాయతీలకు నిధులు తక్కువగా వస్తాయని, ప్రజలు బిల్లులు కట్టే పరిస్థితి ఉండదని సర్పంచ్‌ల సంఘం జిల్లా కన్వీనర్ బెల్లం శ్రీనివాస్  అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆయన కోరారు. లేదంటే ఆందోళనలకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం గౌరవ అధ్యక్షులు నరేందర్, ఎన్డీ నాయకులు రాయల చంద్రశేఖరరావు, సీఐ టీయూ నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement