అఖిలపక్షం సీఎం ఇంట్లో దావత్ కాదు కదా..?
* వైఎస్సార్‌సీపీని అఖిలపక్ష భేటీకి పిలవకపోవడం ఏమిటీ..?
* ఏ ప్రాతిపదికన మా పార్టీని ఆహ్వానించలేదు..?
* ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా?
* నేడు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన
* వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన తమ పార్టీని.. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఏ ప్రాతిపదికన ఆహ్వానం పంపలేదో టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఈసీ గుర్తింపు పొందిన పార్టీని పిలవకపోవడం అంటే ఎన్నికల సంఘాన్ని అవమానించడమేనని ధ్వజమెత్తింది. అఖిలపక్ష సమావేశమనేది ముఖ్యమంత్రి ఇంట్లో దావత్(విందు) అయితే కాదు కదా? అని ప్రశ్నించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థకు లోబడి అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు ఆహ్వానం పంపించాల్సి ఉం డగా, తమ పార్టీకి ఎందుకు పంపించలేదో చెప్పాలని నిలదీసింది. ప్రభుత్వం ఏ ప్రామాణికం ఆధారంగా మిగతా పార్టీలను పిలిచిం దో, ఏ కొలబద్ద ప్రాతిపదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేయదలుచుకుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీనే లేదని, విలీనమైపోయిందని ప్రకటించిన అధికార టీఆర్‌ఎస్.. ఆ పార్టీని అఖిలపక్షానికి ఆహ్వానించగా తమ పార్టీని మాత్రం ఎలా విస్మరించిందని ప్రశ్నించారు.
సీపీఐ, సీపీఎంకు అసెంబ్లీలో ఒక్కో సభ్యుడే ఉన్నా అఖిలపక్షానికి పిలిచారని, వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల్లో తెలంగాణలో ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిచిన విషయాన్ని ఎలా విస్మరించారని నిలదీశారు. ఈ అంశంపై తాము రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఇది సీఎంకు తెలియకుండా జరిగితే దానిని సరిదిద్దుకోవాలని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన దీక్షను చేపడుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుతూ.. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అబద్ధాల సర్కార్‌గా మారిపోయిందని, ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వంటి దుర్మార్గమైన, తుగ్లక్ పాలన ఎక్కడా లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్లు తెరిచి చిల్లర మల్లర రాజకీయాలు చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించేలా అఖిలపక్షానికి తమ పార్టీని ఆహ్వానించాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని నిర్ణయాలూ తీసుకుని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో మొక్కుబడిగా అఖిలపక్షానికి కొన్ని పార్టీలనే ఆహ్వానించిందని విమర్శించారు.