రాజధానిపై అఖిలపక్ష సమావేశం అభిప్రాయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో అన్ని పక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అఖిల పక్ష సమావేశం అభిప్రాయపడింది. ఏపీ రాజధాని ఏర్పాటుపై సిటిజన్స్ ఫోరం శనివారం హైదరాబాద్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఏకపక్షంగా, ఏ కొందరికో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు చేయడంవల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సమావేశం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఫోరం ప్రతినిధులు, పలు పార్టీల నేతలు హాజరై అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
ఎం.వి. మైసూరారెడ్డి( వైఎస్సార్ సీపీ) : రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి. ఒంటెత్తుపోకడలతో ముందుకెళ్లడం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నచోటే రాజధాని నిర్మాణం చేపట్టాలి.
సి.రామచంద్రయ్య (కాంగ్రెస్): విభజన వల్ల ఏ ప్రాంతానికి అన్యాయం జరిగిందో అక్కడే రాజధాని నిర్మాణం చేపట్టాలి.
గడికోట శ్రీకాంత్‌రెడ్డి( వైఎస్సార్‌సీపీ): గతంలో రాజధానిని కోల్పోయిన కర్నూలును పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రాంత అభివృద్ధికి ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం తగదు.
చింతామోహన్, మాజీ ఎంపీ : కాంగ్రెస్ అధికారంలో ఉంటే తిరుపతిని రాజధానిగా ఎంపిక చేసేవారు. సి.ఆంజనేయరెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి: రాజధాని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను ఎంపిక చేయాలి. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి: అన్నింటా అన్యాయానికి గురవుతున్నామని రాయలసీమ వాసుల్లో ఆవేదన ఉంది. అందుకే రాజధాని ఎంపికపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దు. హన్మంతరెడ్డి, సిటిజన్స్ ఫోరం: శ్రీబాగ్ ఒప్పందం మేరకు సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి.
వీఎల్‌ఎన్‌రెడ్డి, నిపుణుడు: దొనకొండ ప్రాంతంలో 68,741 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 14 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ కుడి కాల్వ, 25 కిలోమీటర్ల పరిధిలో వెలిగొండ ప్రాజెక్టులు ఉన్నాయి. జీఆర్ రెడ్డి, సిటిజన్స్ ఫోరం: రాష్ట్ర విభ జించే సమయంలో సమన్యాయం పాటించలేదని విమర్శిస్తున్న చంద్రబాబు రాజధాని ఏర్పాటు విషయంలో మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఏకపక్ష నిర్ణయం వద్దు
Published Sun, Aug 17 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement