న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, డీఎంకే, ఏడీఎంకే, బీజేడీ, ఆప్, ఆర్‌జేడీ, శివసేనతోపాటు వామపక్షాల పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నిత్యానంద్ రాయ్, అజయ్ కుమార్ మిశ్రా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలను హోం మంత్రి అమిత్ షా వారికి వివరించారు. ప్రధాని మోదీ స్వయంగా ప్రతిరోజూ అక్కడి పరిస్థితులపై వాకబు చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వెంటనే అఖిలపక్ష బృందాన్ని పంపించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీల నేతలు కోరారు. శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, సీఎం బిరెన్ సింగ్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్‌పీ కోరింది. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం చేయగలిగిందంతా చేస్తోందని చెప్పారు. అఖిలపక్ష బృందాన్ని పంపించడంపై అమిత్ షా ఎటువంటి ప్రకటన చేయలేదని అనంతరం బీజేపీ మణిపూర్ ఇన్‌చార్జి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు. ప్రభుత్వం మణిపూర్‌ను మరో కశ్మీర్‌లాగా మార్చాలనుకుంటున్నట్లుందని అక్కడి పరిస్థితులపై టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్ మీడియాతో వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో మంత్రి గోదాముకు నిప్పు
మణిపూర్‌లో నిరసనకారుల గుంపు మరోసారి రెచ్చిపోయింది. శుక్రవారం రాత్రి తూర్పు ఇంఫాల్ జిల్లా చింగారెల్‌లోని మంత్రి ఎల్.సుసింద్రోకు చెందిన ప్రైవేట్ గోదాముకు నిప్పుపెట్టడంతో అది కాలిబూడిదయింది. అనంతరం ఖురాయ్‌లోని మంత్రి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై బాష్పవాయువును ప్రయోగించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment