న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడంపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికార, ప్రతిపక్ష నాయకులను సమావేశపర్చి మాట్లాడతామన్నారు. విపక్షాల ఆందోళనతో సభను నిర్వహించడానికి అష్టకష్టాలు పడిన స్పీకర్ సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజూ విపక్షాలు ఇలా అందోళనకు దిగితే సభా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు.
ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా సభలోకి ప్లకార్డులు తీసుకురావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలా జరగకుండా సభ్యులను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా సభలో చర్చలు జరగ్గకుండా స్తంభింపచేయడం సరైనది కాదన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నట్టు ఆమె తెలిపారు. పార్లమెంటును పదేపదే అడ్డుకుంటూ చర్చలకు ఆటంకం కలిగించడం భావ్యం కాదని సుమిత్రా అన్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులతో చర్చించి ఆయా అంశాలను పరిష్కరించు కోవాల్సి అవసరం ఉందని తెలిపారు.
కాగా గత మూడురోజులుగా వ్యాపం, లలిత్ మోదీ కుంభకోణాలపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. అధికార బీజేపీ పార్టీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కళంకిత మంత్రులు రాజీనామాలు చేసే దాకా చర్చలు జరిగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బీజేపీ మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.