డుమ్మా కొట్టిన తృణమూల్ కాంగ్రెస్!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టింది. వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరేందుకు మోదీ సర్కారు ఈ భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు, పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. జీఎస్టీ సహా ప్రతిపక్షాలు లేవనెత్తుత్తే ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.
24 ఉత్తర పరగణాల జిల్లాలో మతఘర్షణలకు బీజేపీ కారణమని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి దూరంగా ఉంది. అయితే, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాము హాజరవుతామని తృణమూల్ స్పష్టం చేసింది.
వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు హాజరు
కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం భేటీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కృష్ణా జలాల పంపకాలు, చేనేత, చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు, ఫిరాయింపు నిరోధక చట్ట సవరణ తదితర అంశాలను వారు ప్రస్తావించారు.