* అసెంబ్లీలో సీఎం కేసీఆర్
* పోలవరంపై త్వరలోనే భేటీ..
* అనర్హుల రేషన్‌కార్డులు, హౌసింగ్ అక్రమాలపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అన్ని నిర్ణయాలను అఖిలపక్షంలో చర్చించి తీసుకుంటామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రతీ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, విపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటామని, తాము పూర్తి విశాల దృక్పథంతో ఉన్నామని ముఖ్యమంత్రి శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు. వివిధ రంగాల్లో లోటుపాట్లపై ఆయన మాట్లాడారు. ‘మేమే నిర్ణయాలు తీసుకుని 63 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు బాగుపడితే సరికాదు.
అన్ని నియోజకవర్గాలూ అభివృద్ధి చెందాలి. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. అందరం పాత్రధారులం.. సూత్రధారులం అవుదాం.. పోలవరం ముంపులోని 7 మండలాలను ఆంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం. శనివారం అసెంబ్లీలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేద్దాం. సమావేశాలు ముగిసిన తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేస్తాను. ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఉపసంహరణకు ఒత్తిడి తెద్దాం. అందుకు బీజేపీ నాయకులు కూడా సహకరించాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
చివరి ఏడాది రాజకీయాలు చేద్దాం..
‘‘అహంకారం, ఒంటెత్తుపోకడతో మేము వెళ్లం. అందర్నీ కలుపుకొని వెళ్తాం. జీహెచ్‌ఎంసీ, కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలు ఉన్నాయి. తర్వాత నాలుగున్నరేళ్లపాటు అభివృద్ధిపై దృష్టిపెడదాం. చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం. మా తప్పులపై మీరు, మీ పనులపై మేము ప్రజాక్షేత్రానికి వెళదాం. ప్రజలు తీర్పునిస్తారు. అప్పటి వరకు అందరం కలిసి పనిచేద్దాం’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
ఇళ్ల కంటే కార్డులెక్కువా?
‘తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యకంటే రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు ఇచ్చిన లెక్కలను మీ ముందు పెడుతున్నాను. దీనిపై ఏమి చేద్దామో మీరే చెప్పండి.. జిల్లాల వారీగా ఉన్న లెక్కలు అఖిలపక్ష సమావేశంలో ఇస్తా. ప్రతిపైసాకు జవాబుదారీతనం ఉండాలి. నిధులు దుర్వినియోగం కారాదు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం కుటుంబాలు 84,20,662 ఉంటే.. తె ల్ల రేషన్‌కార్డులు 91,94,880, గులాబీ కార్డులు 15,07,509, అంత్యోదయ కార్డులు కూడా కలుపుకొంటే.. మొత్తం 1,07,02,479 కార్డులున్నాయి. ఇంకా లక్షల సంఖ్యలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఉన్నాయి. ఇది అధికారులు ఇచ్చిన లెక్క. ఇదేమి చందులాల్ దర్బార్ (నిజాం ప్రభుత్వంలో ఉండేది). తెలంగాణ సొమ్ము ఇలా పోతుంటే ఎలా..? వీటిని ఏమి చేద్దామన్న అంశంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందాం’ అని అన్నారు.
హౌసింగ్ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు
ఇళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులపై విచారణ జరిపిస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ‘1983-2014 మధ్య కాలంలో తెలంగాణలో మొత్తం 42 లక్షలు ఇళ్లు నిర్మించారు. ఇంకా ఐదు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. 83-94 వరకు సెమీ పక్కా ఇళ్లు 10 లక్షలు నిర్మించామంటున్నారు. తెలంగాణలో ఉన్న కుటుంబాల సంఖ్యే 84 లక్షలు. మరి ఇంకా ఇళ్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దాం’ అని అన్నారు.
అఖిలపక్షంలోనే అన్ని నిర్ణయాలు
Published Sat, Jun 14 2014 1:57 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement