అఖిలపక్షం పేరుతో విభజన ఆపొద్దు | Dont stop state division by all-party meeting | Sakshi
Sakshi News home page

అఖిలపక్షం పేరుతో విభజన ఆపొద్దు

Published Mon, Nov 4 2013 2:14 AM | Last Updated on Sat, Aug 11 2018 7:51 PM

అఖిలపక్షం పేరుతో విభజన ఆపొద్దు - Sakshi

అఖిలపక్షం పేరుతో విభజన ఆపొద్దు

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మరోసారి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చెప్పారు. అఖిలపక్ష సమావేశం ద్వారా తెలంగాణ ప్రక్రియను ఆపడానికి ప్రయత్నించకూడదని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. పార్టీ నాయకులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జి.వివేక్, స్వామిగౌడ్, వినోద్‌కుమార్, గోయల్, రమణాచారి, దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి  తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మళ్లీ మళ్లీ కమిటీల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాలయాపన చేయవద్దని ఈటెల  కోరారు. విభజన  నిర్ణయం నేపథ్యంలో 11 అంశాలపై కేంద్ర హోం శాఖ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు కోరుతూ రాసిన లేఖకు స్పందనగా తమ పార్టీ అభిప్రాయాలతో కూడిన 12 పేజీల నివేదికను జీవోఎంకు మెయిల్ ద్వారా పంపినట్టు నేతలు చెప్పారు. నివేదిక ప్రతిని పోస్టు ద్వారా కూడా పంపనున్నామన్నారు. జీవోఎంకు టీఆర్‌ఎస్ అందజేసిన నివేదిక వివరాలు క్లుప్తంగా...
 
 హైదరాబాద్ పోలీస్ తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి

  •  కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విభజన నోట్‌లోనూ, సీడబ్ల్యూసీ తీర్మానంలోనూ హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను టీఆర్‌ఎస్ సమర్థిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ శాసనమండలిని కొనసాగించాలి.
  •  హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అన్నది తాత్కాలిక వెసులుబాటే అయినందున ఆ ప్రభుత్వ నిర్వహణకు అన్నిరకాల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తున్నాం. అయితే ఆ ప్రాంతంలో అతిత్వరగా కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి వారే ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నాం.
  •  శాంతిభద్రతలు పూర్తిగా రాష్ట్రం పరిధిలోనే ఉండే అంశం. హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ సైతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి.
  •  రాష్ట్ర విభజనతో పాటు రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులను ఏర్పాటు చేయాలి. హైకోర్టులో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతి త్వరగా రెండుగా విడదీయాలి.
  •  రాజ్యాంగంలో పొందుపరిచిన 371 డి కొనసాగించాలి.
  •  కృష్ణా నదీ జలాలలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మిగులు జలాలలో తెలంగాణ రాష్ట్రం తమ న్యాయమైన వాటా కోరే వరకు బ్రజే శ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును అమలులోకి రాకుండా చూడాలి. ట్రిబ్యునల్ రాష్ట్రానికి అదనంగా 190 టీఎంసీల కృష్ణా నీరు వస్తుందని ప్రాథమికంగా తేల్చింది. ఇక్కడి పాలకులు ఈ నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతంలో లేని ప్రాజెక్టులకు కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మా న్యాయమైన వాటా కోరేవరకు ట్రిబ్యునల్ తుది తీర్పు అమలు చే యరాదు.
  •  దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతం కోసం గోదావరి, కృష్ణా నదులపై ఒక్కో జాతీయ ప్రాజెక్టును నిర్మించాలి.
  •  పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర పరిధిలో ఉన్నప్పటికీ, దీని వల్ల ముంపునకు గురయ్యేది అధికంగా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలే. అందువల్ల ముంపు బాధితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ ప్రకటించడంతో పాటు వన్యప్రాణి, అటవీ పర్యావరణ అనుమతుల తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణ  పనులు చేపట్టాలి.

 సింగరేణిపై పూర్తి హక్కులు తెలంగాణకే ఇవ్వాలి 

  • సింగరేణి బొగ్గు గనులపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న పూర్తి హక్కులను తెలంగాణ ప్రభుత్వానికి కల్పించాలి. సింగరేణిలో ఉన్న 51 శాతం రాష్ట్ర పూర్తి వాటాను తెలంగాణకు బదలాయించాలి.
  •  తెలంగాణ ప్రాంతానికి ఈ సరికే మంజూరు చేసిన రైల్వేలైన్లను పూర్తి చేయాలి.
  •  నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించాలి. మరో 1400 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లాలో నిర్మించాలి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బొగ్గు గనుల నుంచి కేటాయించిన బొగ్గులో 60 శాతం వాటాను తెలంగాణకు కేటాయించాలి.
  •  1956కు ముందు హైదరాబాద్ రాష్ట్ర ఆస్తులుగా ఉన్నవన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. అప్పట్లో ఢిల్లీలో ఉండే హైదరాబాద్ హౌస్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన భూములు, ఆంధ్రాభవన్ తెలంగాణకే చెందాలి.
  •  తెలంగాణ ప్రాంతంలో ఒక ఐఐఎం, జాతీయ స్థాయి మెడికల్ సైన్స్ సంస్థతో పాటు గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. 
  • 57 ఏళ్లలో జరిగిన నష్టానికి తగినవిధంగా ప్యాకేజీ ఇవ్వాలి
  •  ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత 57 ఏళ్లలో రూ.4.10 లక్షల కోట్ల తెలంగాణ ప్రాంత నిధులను వేరే ప్రాంతాలలో ఖర్చు పెట్టారు. దీనివల్ల మరో రూ.4.78 లక్షల కోట్ల ఆదాయం ఈ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఈ 57 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలోని 2. 5 లక్షల కుటుంబాలు రెండు తరాల పాటు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని 57 ఏళ్ల పాటు జరిగిన నష్టానికి ప్రతిఫలంగా ఈ ప్రాంతానికి తగిన ప్యాకేజీ ప్రకటించాలి.
  •  రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు చాలా తక్కువమంది ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకారం తెలిపితే వారందరినీ ఇక్కడికి బదలాయించాలి.
  •  రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సర్వీసు పుస్తకం పరిశీలించి ఎవరు ఏ ప్రాంత ఉద్యోగి అన్నది నిర్ధారించాలి. అక్రమంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఉద్యోగులు ఇక్కడే పెన్షన్ తీసుకుంటున్నారు. వీరికి తెలంగాణ ట్రెజరీ నుంచి కాకుండా అవతలి ప్రాంతంలో పెన్షన్ చెల్లింపు ఏర్పాట్లు జరగాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement