ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు | Vehicle-ramming a new strategy by militants in Kashmir | Sakshi
Sakshi News home page

ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు

Published Fri, Feb 15 2019 4:26 AM | Last Updated on Fri, Feb 15 2019 5:14 AM

Vehicle-ramming a new strategy by militants in Kashmir - Sakshi

న్యూఢిల్లీ: సైనిక బలగాలపై దాడులకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగినవే. పుల్వామాలో జరిగిన దాడిలో ఉగ్రవాది 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి జవాన్ల వాహనశ్రేణి వద్ద పేల్చుకోవడం వారి కొత్త వ్యూహాన్ని సూచిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి తరహా పేలుళ్లు చివరిసారిగా 2001లో సంభవించాయి. అప్పుడు అసెంబ్లీ సమీపంలో కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఉగ్రవాదులు 38 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఐఈడీ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. చాన్నాళ్లు తరువాత కశ్మీర్‌లో ఐఈడీ దాడులు పెరగడంపై ఆర్మీ ఆందోళన చెందుతోంది.

గతేడాది జనవరిలో బారాముల్లాలో చోటుచేసుకున్న ఇలాంటి దాడిలో నలుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు భద్రతా బలగాలకు కొత్తేం కాదు. కానీ కశ్మీర్‌లో తక్కువ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల వ్యూహాలు వేరుగా ఉంటాయి. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారు. ఇటీవల అగ్రస్థాయి ఉగ్రవాదుల్ని వరసగా మట్టుపెట్టడంతో, మిగిలిన టెర్రరిస్టుల్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ పెరిగిందని, ఇందులో భాగంగానే ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వేర్పాటువాదులకు చేరువకావాలనుకుంటున్న పాకిస్తాన్‌ ప్రయత్నాలను భారత్‌ అడ్డుకోవడం కూడా ఉగ్రవాదుల వ్యూహాల మార్పునకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.  

కశ్మీర్‌ను పాక్‌లో కలపడమే లక్ష్యం
భారత్‌లో పలు ఉగ్రదాడులకు జైషే స్కెచ్‌  
సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పాల్పడిన జైషే మొహమ్మద్‌ను మౌలానా మసూద్‌ అజహర్‌(50) 2000, మార్చి నెలలో ప్రారంభించాడు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టి పాకిస్తాన్‌లో కలపాలన్న ఏకైక లక్ష్యంతో ఈ సంస్థ పనిచేసేది. పాక్‌ ప్రోద్బలంతో జైషే ఉగ్రవాదులు భారత్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సైనికులపై దాడులకు పాల్పడ్డారు. సొంత దేశంలోని ముస్లిమేతరులను ఈ ఉగ్రసంస్థ విడిచిపెట్టలేదు. 2001, అక్టోబర్‌ 1న కశ్మీర్‌ అసెంబ్లీపై దాడికి పాల్పడి 38 మందిని బలికొనడంతో జైషే మొహమ్మద్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని తామే చేశామని తొలుత గర్వంగా ప్రకటించుకున్న జైషే సంస్థ.. ఆ తర్వాత తమకు సంబంధం లేదని బుకాయించింది.


అదే ఏడాది భారత పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి దాడిచేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాకిస్తాన్‌ జైషే మొహమ్మద్‌ను 2002లో నిషేధించింది. అయినప్పటికీ ఇతర సంస్థల ముసుగులో జైషే మొహమ్మద్‌ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 2016లో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ జైషే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కశ్మీర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మసూద్‌ అజహర్‌ మేనల్లుడు, స్నైపర్‌ ఉస్మాన్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి మసూద్‌ తెగబడ్డాడని నిపుణులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement