పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ వీలున్నన్ని దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చైనా మినహా దాదాపు అన్ని ప్రధాన దేశాలు భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే దౌత్యపరమైన దెబ్బ కొడితే.. దీని ప్రభావం ఉన్మాదపు పాక్‌పై కనిపించేందుకు సమయం పడుతుంది. కానీ 40 మంది సహచరుల ప్రాణాలను తీసిన పాక్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతాదళాల రక్తం మరుగుతోంది. కశ్మీర్‌లో జరిగే ప్రతీ దాడి వెనుక పాక్ హస్తం ఉంటోందని.. స్పష్టమైన ఆధారాలు లభించాక కూడా ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అంటూ బలగాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఎన్నేళ్లు ఉన్మాద పొరుగుదేశం ఆగడాలను సహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనిపట్టడానికి సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడంతో మిలటరీ తన ముందున్న మార్గాలను విస్తృతంగా పరిశీలిస్తోంది.
యుద్ధ విమానాల మోహరింపు
పాక్‌పై చర్యలకు అన్నిరకాల దౌత్య మార్గాలను పరిశీలిస్తూనే.. అవసరమైతే దాడి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే.. ఇప్పటికే సరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలను మోహరించింది. భారత్ వాయుసేన సత్తా చాటేలా.. వాయుశక్తి విన్యాసాలు చేయాలని కొద్ది నెలల క్రితమే భారత్ భావించింది. ఇందుకోసమే జాగ్వార్ ఫైటర్ విమానాలు, మిరాజ్–2000 విమానాలను, మల్టీ–రోల్ జెట్స్‌ను మోహరించింది. విన్యాసాల కోసం మోహరించిన ఈ యుద్ధ విమానాలతోనే ఇపుడు పాక్‌పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
అప్రమత్తమైన పాక్.. టెర్రరిస్టులు వెనక్కి
పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించకుండా కఠినమైన చర్యల్ని తీసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తూ ఉండటంతో పాక్ అప్రమత్తమైంది. కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదుల్ని వెనక్కి రప్పిస్తోంది. ఎన్నో ఉగ్రవాద శిబిరాలను మూసివేస్తోంది. ప్రతీకార దాడుల కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఉగ్రవాద స్థావరాలే భారత్ మొదటి టార్గెట్ అని గుర్తించిన పాక్ సరిహద్దులను ఖాళీ చేస్తోంది.
మిలటరీ ముందున్న మార్గాలివే!
► పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండానే అత్యాధునిక యుద్ధ విమానాలతో పాక్ దిమ్మ తిరిగేలా దాడులకు దిగడం. సూటిగా పయనించే గైడెడ్ బాంబులు, క్షిపణులు అమర్చిన సుఖోయ్–30 ఎంకేఐ, మిరాజ్–2000, జాగ్వార్ ఫైటర్ విమానాలను ప్రయోగించి ఉగ్రవాదుల కీలక స్థావరాలను ధ్వంసం చేయడం. ఇప్పటికే సైనిక విన్యాసాల కోసం సరిహద్దుల్లో విమానాలు మోహరించి ఉండటంతో
ఈ దాడుల్ని చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు.
► భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణం.. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోజేకే). ఆ ప్రాం తంలో నిర్దేశిత లక్ష్యాలపై వైమానిక దాడులు లేదంటే బ్రహ్మోస్ క్షిపణితో దాడికి పాల్పడటం.
► సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి నెలరోజులకు పైగా నిర్విరామంగా కాల్పులకు దిగడం. వాస్తవాధీన రేఖ వెంట భింబెర్ గలీ వంటి ప్రాంతాల నుం చి ఇలాంటి కాల్పులు జరిపితే భారతీయ సైనికులకు భద్రంగా ఉంటుంది. భారత ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సైన్యాన్ని మోహరించింది.
► 2016లో ఉడీలో సైనిక శిబిరంపై దాడి చేశాక పీవోజేకేలోని ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక బలగాలు మెరుపు దాడులకు పాల్పడినట్లుగా.. మరోసారి సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రస్థావరాలపై దాడులకు పాల్పడటం. అయితే.. సర్జికల్ స్ట్రైక్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో చేసిన ఈ తరహా దాడుల వల్ల పాక్‌కు బుద్ధి రాకపోగా.. వరుసగా దాడులకు పాల్పడుతోంది. అందుకే పాక్ మిలటరీపైనే నేరుగా దాడులు చేసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించకుండా కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
► వాస్తవాధీన రేఖ చొరబాట్ల్లకు క్షేమం కాదని ఉగ్రవాద సంస్థలు గుర్తించేలా విస్తృత స్థాయిలో దాడులు జరపడం.
► పూంచ్, ఉడీ పట్టణాలను కలిపే కీలకమైన హజీపీర్ మార్గం ద్వారా చొరబాట్లు అత్యధికంగా ఉంటున్నాయి. 1965 పాక్ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ తన దళాన్ని అక్కడ్నుంచి ఉపసంహరించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని పాక్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తోంది. ఆ ప్రాంతంలో మళ్లీ సైన్యాన్ని మోహరించి చొరబాట్లను అణచివేయడం.
► పాక్ సైనిక, ఉగ్రవాద శిబిరాలు, ఇతర కీలక స్థావరాలను నాశనం చేయడానికి 90 కిలోమీటర్ల రేంజ్‌లో సమర్థవంతంగా పనిచేసే స్మెర్చ్ (బీఎం–30) రాకెట్ల వ్యవస్థలు, 290 కిలోమీటర్ల రేంజ్‌లో పనిచేసే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణులను యుద్ధవిమానాలతో ప్రయోగించి మెరుపు దాడులకు దిగడం.
► జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను భారత్‌కు తీసుకువచ్చేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం. ఇస్లామాబాద్‌లో భారత్ హైకమిషనర్ అజయ్ బిస్రాయ్‌వెనక్కి పిలిపించడం ద్వారా దౌత్యపరంగా పాక్‌కు ఒంటరిని చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతోంది.
పాక్‌ను దెబ్బకొట్టేదెలా?
Published Sun, Feb 17 2019 5:27 AM | Last Updated on Sun, Feb 17 2019 3:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment