శ్రీనగర్‌లో అప్రమత్తంగా ఉన్న జవాను
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్‌లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment