రియాధ్: యెమెన్ ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడులతో సౌదీ అరేబియా చమురు క్షేత్రాల్లో మంటలు చెలరేగాయి. సౌదీ తూర్పు ప్రాంతంలో ఆరామ్‌కోకు చెందిన అబ్కేయిక్, ఖురైస్ క్షేత్రాలపై శనివారం వేకువ జామున రెండు డ్రోన్లు కూలాయి. దీంతో భారీగా చెలరేగిన మంటలను సిబ్బంది దాదాపు రెండు గంటల అనంతరం అదుపులోకి తెచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి కారణం తామేనంటూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హౌతి ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు.
ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపిన అంతరంగిక శాఖ మంత్రి.. డ్రోన్లు ఎక్కడివి? ప్రాణాపాయం, పనులపై ప్రభావం వంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, అబ్కేయిక్, ఖురైస్‌లపై శనివారం వేకువజామున పది వరకు డ్రోన్లతో తాము దాడి చేసినట్లు హౌతీ ఉగ్రవాదుల ప్రతినిధి అల్ మసీరా టీవీకి తెలిపారు. ఇటీవలి కాలంలో హౌతి ఉగ్రవాదులు సౌదీ అరేబియా వైమానిక స్థావరాలపై పలు క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. యెమెన్‌లో తమ ప్రాంతాలపై సౌదీ అరేబియా దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు అంటున్నారు.
ఆరామ్‌కోకు ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన అబ్కేయిక్‌పై గతంలో అల్‌ఖైదా జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఎగుమతి చేసే సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు గల్ఫ్ జలాల్లోని ఆయిల్ ట్యాంకర్లపై జూన్, జూలైల్లో జరిగిన దాడులకు ఇరానే కారణమంటూ సౌదీ ప్రభుత్వం, అమెరికా ఆరోపిస్తుండగా తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. వ్యాపార విస్తరణ కోసం ఆరామ్‌కో త్వరలోనే ఐపీవోకు వెల్లనుండగా ఈ పరిణామం సంభవించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment