దుబాయ్: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్‌లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్‌పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్‌నెట్ సౌకర్యం నిలిచిపోయింది.
ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సదా నగరంలోని జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు రెడ్‌క్రాస్ సంస్థ ప్రకటించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయమై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు.
సిరియా, ఇరాక్‌లో ఐసిస్ దాడులు
బాగ్దాద్: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు గురువారం రాత్రి దాడి జరిపగా, ఇరాక్‌లో ఆర్మీ బ్యారక్‌పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్‌లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు.
ఇటీవల కాలంలో రెండు దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీ, సిరియన్ల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్‌లు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు.
ఆ సమయంలో జైల్లో 3వేలమంది ఐసిస్ మిలిటెంట్లున్నారని కుర్దిష్ డెమొక్రాటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారుబాంబు పేలిందని జైలు వర్గాలు తెలిపాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. 2017లో ఇరాక్, 2019లో సిరియాల్లో ఐసిస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇలా మెరుపుదాడులకు దిగడం ఆరంభించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలటరీ ప్రతిజ్ఞ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment