![Kuwait Building Fire: 49 Indians killed in fire at Kuwait building housing workers, 50 others injured](/styles/webp/s3/article_images/2024/06/13/kuwaite.jpg.webp?itok=q8df1xQA)
మృతుల్లో 42 మంది భారతీయులే!
50 మందికి గాయాలు
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కారి్మకులు నివసిస్తున్నారు.
వివిధ దేశాల నుంచి వలస వచి్చన వీరంతా ఎన్‌బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కారి్మకుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కారి్మకులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.
క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స
అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది.
కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కారి్మకుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కలి్పంచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు.
యాజమాన్యం దురాశకు అమాయకులు బలి
మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కలి్పంచని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కారి్మకులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
హుటాహుటిన కువైట్‌కు మంత్రి రాజవర్ధన్ సింగ్
కువైట్ అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. కువైట్ భారత రాయబార కార్యాలయం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్‌కు బయలుదేరారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. మృతుల్లో మలయాళీలు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. కేంద్రం వెంటనే తగిన సాయం అందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment