
ధరూరు (గద్వాల): పత్తి మిల్లులో రాత్రి షిఫ్టు పనులకు వెళ్లి తిరిగి వస్తూ.. గత సోమవారం తెల్లవారుజామున గద్వాల మండలం గోనుపాడు శివారులోని పారుచర్ల స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 9మంది పరిస్థితి విషమంగా ఉండగా కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రమేష్(18), నరేష్(17) మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. కోలుకుంటారని కోటి ఆశలతో ఎదురుచూసిన ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. ఈ సంఘటనతో చిన్నపాడు గ్రామం ఇంకా కోలుకోలేకపోతోంది. ఎవరి నోట విన్నా ఈ సంఘటన గురించే చర్చించుకోవడం కనిపిస్తుంది.
బడి మానేసి పనులకు..
గ్రామానికి చెందిన కర్రె కొండన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొండన్నకు పెళ్లి కాగా చెందిన రెండో కుమారుడు రమేష్(18) ఉన్నాడు. ఈయన తల్లి గత కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ఎంకన్న, ముణెమ్మ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమా ర్తె. మృతి చెందిన నరేష్(17) రెండోవాడు. నరేష్ ధరూ రు ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ బీసీ హాస్టల్‌లో ఉండేవాడు. ఏడో తరగతి వరకు చదివిన నరేష్ కుటుం బ ఆర్థిక పరిస్థితులతో బడిమానేసి పనులకు వెళ్లాడు. చదువు అలాగే కొనసాగినా ఇలా పనులకు వెళ్లి మృత్యువాత పడేవాడు కాదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. ఈ రెండు కుటుంబాల రో దనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.