డోర్ వద్ద కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యం
కారేపల్లి : రైలు బోగీల్లో కూర్చునేందుకు సీట్లు ఉంటాయి. అయినా సీట్లలో కూర్చోరు. డోర్ వద్ద నిల్చుంటారు. అక్కడే కూర్చుని ప్రయాణిస్తున్నారు. చెవుల్లో హియర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్ పాటలు వింటుంటారు. ఆదమరిచి ప్రయాణించటం యువత ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. రైలు వేగం ఓ వైపు, ట్రాక్ మూలమలుపులు మరో వైపు.. దీనికి తోడు అజాగ్రత్త, మైమరపులతో అదుపు తప్పి, రైలు నుంచి జారిపడి నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ప్రమాదాలతో మృత్యువాత పడి, కన్న తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగిల్చుతున్నారు. ప్రమాదాల అంచుల్లో ప్రయాణిస్తూ.. నిండైన నిర్లక్ష్యంతో జీవితానికి ముగింపు పలుకుతున్నారు.
కారేపల్లి మీదుగా విజయవాడ, హైదారాబాద్, కొత్తగూడెం వైపు నిత్యం వందల సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. వీటిలో 15 వరకు ఫ్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కారేపల్లి రైల్వే జంక్షన్ ద్వారా వేలాది మంది ప్రయాణికులు విజయవాడ, హైదరాబాద్, కొత్తగూడెం వైపు నిత్యం ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. దీనికి తోడు కారేపల్లిలో ఇంజనీరింగ్, ఎంబీఏ, పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు ఉండటంతో విద్యార్థుల రద్దీ పెరిగింది.
ఇదిలా ఉండగా కారేపల్లి నుంచి గాంధీపురం రైల్వే స్టేషన్ వరకు 4 కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ అత్యంత మూలమలుపులతో ఉంది. యువకులు డోర్‌ల వద్ద కూర్చుంటున్నారు. రైలు వేగంలో డోర్ వెనుకాల నుంచి గట్టిగా తగిలి.. అదుపు తప్పి రైలు కింద పడిపోయి ప్రాణాలను వదులుతున్నారు. దీనికి తోడు కదులుతున్న రైలు ఎక్కడం, దిగటం చేస్తుండటంతో అదుపు తప్పి ప్రమాదాలకు గురౌతున్నారు.
జరిగిన కొన్ని ప్రమాదాలు..
- మార్చి 4 రాత్రి టేకులపల్లి మండలం లక్ష్మాతండా గ్రామానికి చెందిన బాణోతు యుగేందర్ (25) కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కాకతీయ ప్యాసింజర్‌లో వెళ్తున్నాడు. డోర్ వద్ద కూర్చొని ఉండటంతో కొమ్ముగూడెం గేటు సమీపంలో ఉన్న మూలమలుపులో జారి రైలు కింద పడి మృతి చెందాడు.
- డిసెంబర్ 18, 2016న కొత్తగూడెం ప్రగతి నగర్‌కు చెందిన డీటీ రాజేష్ (17) 10 మంది స్నేహితులతో కలిసి మణూగూరు ప్యాసింజర్‌లో కొత్తగూడెం నుంచి కాజీపేటకు వెళ్తున్నాడు. కొమ్ముగూడెం రైల్వే గేట్ సమీపంలో ఉమ్మివేసేందుకు డోర్ వద్దకు వచ్చాడు. డోర్ వెనుక నుంచి గట్టిగా నెట్టివేయటంతో కింద పడి మృతి చెందాడు.
- జనవరి 23, 2016న టేకులపల్లి మండలం ఈర్యాతండా గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి నూనావత్ రాములు కారేపల్లి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు దిగే క్రమంలో కింద పడి మృతి చెందాడు.
- 2015లో గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆకుల అనసూర్యమ్మ అనే వృద్ధురాలు రొట్టమాకురేవు మూలమలుపు వద్ద కాకతీయ ప్యాసింజర్‌లో నుంచి కిందపడి మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment