
ఆపదలో ‘108’
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహన సేవలు ఒకప్పుడు అమృత సంజీవనిగా సేవలందించాయి. ప్రస్తుతం ఆ సేవలు అందకుండా పోతున్నాయి.
- ఫోన్ చేస్తే.. వాహనం లేదంటూ సమాధానం!
- అవస్థలు పడుతున్న వ్యాధిగ్రస్తులు, బాధితులు
మెదక్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహన సేవలు ఒకప్పుడు అమృత సంజీవనిగా సేవలందించాయి. ప్రస్తుతం ఆ సేవలు అందకుండా పోతున్నాయి. ఎప్పుడు ఫోన్ చేసినా వాహనం అందుబాటులో లేదనే సమాధానం వస్తుందని ప్రజలు చెబుతున్నారు. అత్యవసర సేవలు అందాల్సిన వ్యాధిగ్రస్తులు, గర్భిణులు సకాలంలో వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు, పురిటినొప్పులతో బాధపడే మహిళలకు, అనారోగ్యంతో మంచంపట్టిన వారు 108కు ఫోన్ చేసిన వెంటనే వారి ఇంటి ముంగిట్లోకి వెళ్లి ఆస్పత్రుల్లో చేర్పించాలి. కానీ గత కొన్ని నెలలుగా 108కు ఫోన్లు చేస్తే వాహనం అందుబాటులో లేదనే సమాధానాలే వస్తున్నాయని మండల వాసులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయి అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనో, మరేకారణమో? తెలియదు కానీ.. ఫోన్ చేస్తే స్పందన రావడం లేదంటున్నారు.
మరో ఘటనలో...
మెదక్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద గుంతలు తీసిపెట్టారు. ఈనెల 19న ఓ యువకుడు బైక్‌పై వచ్చి ఆ గుంత దగ్గర అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయమైంది. రక్తం పోతుంది. అక్కడే ఉన్న కొందరు యువకులు 108కు ఫోన్ చేశారు. ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. వాహనం అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. చేసేదేమిలేక సదరు యువకులు ఓ ప్రైవేట్ వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
వాహనం అందుబాటులో లేదన్నారు
నా కూతురు పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఈనెల 21న రాత్రి 10 గంటలకు 108కు ఫోన్ చేశా. మహేశ్ అనే వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం అందుబాటులో లేదని చెప్పాడు. దీంతో ఓ ప్రైవేట్ వాహనానికి రూ.1500 చెల్లించి నా కూతురిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లా. - సత్తయ్య, ఆరెగూడెం, వెల్దుర్తి మండలం