పేజర్లే బాంబులై... | Hezbollah hit by a wave of exploding pagers and blames Israel | Sakshi
Sakshi News home page

పేజర్లే బాంబులై...

Published Wed, Sep 18 2024 5:05 AM | Last Updated on Wed, Sep 18 2024 5:05 AM

Hezbollah hit by a wave of exploding pagers and blames Israel

లెబనాన్‌లో విధ్వంసం 

 ఉన్నట్టుండి పేలిన వైనం 

2,800 మందికి గాయాలు

ఇప్పటికే 9 మరణాలు 

వందల మంది విషమం 

ఇజ్రాయెల్‌ పనే: హెజ్బొల్లా 

బీరూట్‌: ఇజ్రాయెల్‌కు తమ ఆనుపానులు చిక్కొద్దనే ఉద్దేశంతో వాడుతున్న పేజర్లు చివరికి హెజ్బొల్లా మిలిటెంట్ల ప్రాణాలకే ముప్పు తెచి్చపెట్టాయి. మంగళవారం దేశంలో పలు ప్రాంతాల్లో వేలాది పేజర్లు ఉన్నపళాన పేలిపోయాయి. ఈ వింత పేలుళ్లలో కనీసం 2,800 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘కనీసం 200 మందికి పైగా ప్రాణాలతో పోరాడుతున్నారు. 

ఇప్పటిదాకా 9 మంది మృత్యువాత పడ్డారు’’ అని ఆరోగ్య మంత్రి ఫిరాస్‌ అబియద్‌ తెలిపారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాలన్నీ హెజ్బొల్లా కంచుకోటలే. రాజధాని బీరూట్‌లో పలుచోట్ల జనం తమ చేతులు, ప్యాంటు జేబులు, బెల్టుల్లోని పేజర్లు పేలి గాయాలపాలవుతున్న వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆస్పత్రుల్లో ఎ మర్జెన్సీ వార్డులన్నీ క్షతగాత్రులతో నిండిపోతున్నట్టు స్థానిక ఏపీ ఫొటోగ్రాఫర్లు తెలిపారు. ప్రధానంగా నడుము, కాళ్లకు గాయాలైనట్టు చెప్పారు. లెబనాన్‌లోని తమ రాయబారి కూడా పేజర్‌ పేలి గాయపడ్డ ట్టు ఇరాన్‌ ధ్రువీకరించింది. సిరియాలోనూ పేజర్‌ పేలుళ్లు జరిగాయి. 

ప్రతీకారం తప్పదు: హెజ్బొల్లా 
ఇది కచి్చతంగా ఇజ్రాయెల్‌ పనేనని హెజ్బొల్లా మండిపడింది. ప్రతీ కారం తప్పదంటూ ప్రకటన విడుదల చేసింది. మిలిటెంట్లు వాడుతున్న పేజర్లనే ఇజ్రాయెల్‌ వారిపైకి ఆయుధాలుగా మార్చి ప్రయోగించిందని ఏపీ అభిప్రాయపడింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసిందని చెప్పుకొచి్చంది. దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరించింది.

 సెల్‌ ఫోన్లు వాడితే తమ కదలికలను ఇజ్రాయెల్‌ కనిపెడుతుందనే భయంతో వాటి వాడకాన్ని హెజ్బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా గతంలోనే ఆదేశించారు. దాంతో కమ్యూనికేషన్‌ కోసం మిలిటెంట్లు పేజర్లు వాడుతున్నారు. ఆ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన కొత్త బ్రాండ్‌ పేజర్లే పేలాయని హెజ్బొల్లా ప్రతినిధి చెప్పుకొచ్చారు. ‘‘అవి ముందుగా వేడెక్కాయి. కాసేపటికే పేలిపోయాయి. వాటిలోని లిథియం బ్యాటరీలే కొంపముంచినట్టున్నాయి’’ అంటూ వాపోయారు. శత్రువు పని పట్టడంలో ఆరితేరిన ఇజ్రాయెల్‌ గూఢచారి సంస్థ మొసాద్‌ ఇలా వినూత్నంగా ప్లాన్‌ చేసిందన్న వ్యాఖ్యలు విని్పస్తున్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement