లెబనాన్‌లో మళ్లీ అనూహ్య పేలుళ్లు
14 మంది దుర్మరణం ∙450 మందికి గాయాలు
ఇజ్రాయెల్ కొత్త యుద్ధ తంత్రం
బీరుట్: వాకీటాకీలు, సౌర విద్యుత్ వ్యవస్థల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌పై భీకర భూతల, గగనతల దాడులతో తెగబడిన ఇజ్రాయెల్ తాజా తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిందని బుధవారం నాటి అనూహ్య పేలుళ్ల స్పష్టమైంది. హెజ్‌బొల్లా సాయుధులు విరివిగా వాడే పేజర్‌లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో బుధవారం వాకీటాకీలు, సౌరవిద్యుత్ వ్యవస్థలు పేలిపోయాయి.
ఈ అనూహ్య పేలుళ్ల ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేజర్‌ల పేలుళ్లతో 13 మంది చనిపోయి 2,800 మంది రక్తమోడిన తరుణంలో మరో ‘సాంకేతిక’ పేలుళ్ల పర్వానికి దిగి ఇజ్రాయెల్ కొత్త యుద్ధతంత్రానికి తెరలేపిందని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో దాదాపు మొత్తం భూభాగాన్ని జల్లెడపట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన లక్ష్యాన్ని లెబనాన్‌కు మార్చుకుందని తాజా ఉదంతం చాటుతోంది.
అంతిమయాత్ర వేళ పేలుళ్లు
పేజర్‌ల పేలుళ్లలో మరణించిన ముగ్గురు హెజ్‌బొల్లా సభ్యులు, ఒక చిన్నారి అంతిమయాత్రలు బీరుట్ శివారులోని దహియేలో కొనసాగుతున్నపుడే వాకీటాకీలు పేలడం గమనార్హం. ‘‘బీరుట్‌లో చాలా చోట్ల వాకీటాకీలు పేలాయి. ఎల్రక్టానిక్ పరికరాలు పేలిన ఘటనల్లో 9 మంది చనిపోయారు’’ అని లెబనాన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. బీరుట్ నగరంతోపాటు లెబనాన్‌లో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయని హెచ్»ొల్లా ప్రతినిధులు చెప్పారు.
వాయవ్య తీర పట్టణమైన సిడాన్‌లో ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ దుకాణం వాకీటాకీల పేలుడుకు ధ్వంసమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్తమోడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పోటెత్తుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి. ‘‘ఇలాంటిది నేనెప్పడూ చూడలేదు. గాయపడిన వారిలో చాలా మందికి చేతివేళ్లు తెగిపోయాయి. కళ్లు దెబ్బతిన్నాయి’’ అని బీరుట్‌లోని దీయూ ఆస్పత్రిలో వైద్యురాలు నౌర్ ఎల్ ఓస్తా చెప్పారు. ‘‘ వరుస అనూహ్య పేలుళ్లతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యంపోస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.
దాడికి ఇదే సరైన సమయమా?
వేలాది మంది హెజ్‌బొల్లా సైనికులు గాయాలపాలై ఆస్పత్రులకు పరిమితమయ్యారు. పేజర్‌ల పేలుడుతో హెజ్‌బొల్లాలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కోలుకోనంతగా దెబ్బతింది. వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లతో పౌరుల్లో ఆందోళనల నడుమ దేశంలో శాంతిభద్రతలపై లెబనాన్ దృష్టిపెట్టాల్సిఉంది. ఈ తరుణంలో దాడి చేస్తే శత్రువును భారీగా దెబ్బ కొట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గడ్డపై వరుస పేలుళ్లతో ఆగ్రహించిన లెబనాన్, హెజ్‌బొల్లా సాయుధాలు దాడులకు తెగబడొచ్చన్న ఇజ్రాయెల్ భావించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రాయెల్ అదనపు బలగాలను తరలించింది. అక్టోబర్ 8న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దమనకాండ మొదలైననాటి నుంచి ఇజ్రాయెల్‌పైకి హెజ్‌బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది.
ఉద్రిక్తతలను ఆపండి: ఐరాస
లెబనాన్ వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తచేసింది. ‘‘ పరిస్థితి చేయిదాట కుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ‘‘ బందీలను విడిచిపెట్టి శాంతి స్థాపనకు కట్టుబడాలి. ఎల్రక్టానిక్ పరికరాల పేలుళ్లకు పాల్పడటం చూస్తుంటే ఇది భారీ సైనిక చర్యకు కసరత్తులా తోస్తోంది’’ అని గుటెరస్ వ్యాఖ్యానించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ చెప్పారు.
యుద్ధంలో కొత్త దశ మొదలైంది: ఇజ్రాయెల్
వాకీటాకీల ఉదంతం తర్వాత రమాట్ డేవిడ్ వైమానిక స్థావరంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో కొత్త దశకు తెరలేపుతున్నాం. యుద్ధక్షేత్ర కేంద్ర స్థానం ఉత్తరం నుంచి దిశ మార్చుకుంటోంది. మాకు ఇప్పుడు స్థిరత్వం అవసరం. బలగాలు, వనరులను వేరే లక్ష్యం వైపు వినియోగించే అవకాశముంది. బుధవారం అద్భుత ఫలితాలు సాధించాం’’ అని సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హెజ్‌బొల్లాపై అదనపు దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో లెబనాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోందని అర్థమవుతోంది. కాగా, వరుస పేలుళ్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఐరాస మానవహక్కుల సంస్థ చీఫ్ వోకర్ టర్క్ డిమాండ్‌చేశారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment