ఉత్పత్తి స్థాయిలోనే అమర్చారన్న హెజ్‌బొల్లా
సెల్‌ఫోన్లతో నిఘా ముప్పు ఉంటుందని పేజర్లకు మారిన హెజ్‌బొల్లా సభ్యులు
ఈఏడాది తొలినాళ్లలో 5,000 కొత్త పేజర్లకు ఆర్డర్
ఘటనలో 12కు పెరిగిన మరణాల సంఖ్య
లెబనాన్, సిరియాల్లో పేజర్‌ల అనూహ్య పేలుళ్లతో గతంలో ఎన్నడూలేనంతగా తొలిసారిగా పేజర్‌లపై చర్చ మొదలైంది. మంగళవారం నాటి ఘటనలో లెబనాన్, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 12కు పెరిగింది. ఇందులో ఇద్దరు చిన్నారులుసైతం ఉన్నారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. అసలు ఏమిటీ పేజర్లు? అవి ఎలా పనిచేస్తాయి? వాటిల్లోకి పేలుడు పదార్థం ఎలా వచ్చి చేరింది? తదతర అంశాలను ఓసారి చూద్దాం.
ఫోన్‌లో నిఘా భయం.. అందుకే పేజర్
గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు బాసటగా నిలుస్తూ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. తమ వ్యూహాలు ఇజ్రాయెల్‌కు చిక్కకుండా ఉండేందుకు హెజ్‌బొల్లా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఫోన్ల ద్వారా సున్నిత, రహస్య సమాచార మార్పిడి జరిగితే ఇజ్రాయెల్ పసిగట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఫోన్లకు స్వస్తి పలికింది. వెంటనే ఫోన్లను పగలగొట్టి పాతిపెట్టాలని హెజ్‌బొల్లా ప్రధాన కార్యదర్శి హసస్ నస్రల్లామ్ తమ సభ్యులకు ఫిబ్రవరి 13న పిలుపునిచ్చారు.
ఫోన్లకు బదులు పేజర్ వాడాలని సూచించారు. పేజర్‌లో సమాచారం అత్యంత సురక్షితంగా, భద్రంగా ఉంటుందని వారి నమ్మకం. దీంతో యుద్ధక్షేత్రంలో ఉండే సైనికులు మొదలు సహాయక సేవల్లో ఉండే వైద్యుల వరకు వివిధ విభాగాల సభ్యులు పేజర్ వాడటం మొదలెట్టారు. వీరి కోసం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త పేజర్‌లను విదేశాల నుంచి తెప్పించారు. పోలీసు, అగ్నిమాపక శాఖలు సహా పలు అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది తక్షణ హెచ్చరికల కోసం పేజర్‌లపై ఆధారపడుతున్నారు.
బ్రాండ్ మాదే.. ఉత్పత్తి మాది కాదు
లెబనాన్‌లో పేలుళ్లకు ఉపయోగించిన పేజర్ ఏఆర్–924 రకానికి చెందినది. ఈ ఏడాది ప్రారంభంలో 5,000 పేజర్లను హెజ్‌బొల్లా ఆర్డర్ చేసింది. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ నుంచి ఏఆర్–924 పేజర్లను తెప్పించినట్లు లెబనాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి స్థాయిలోనే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగి ప్రతి పేజర్‌లో 3 గ్రాముల బరువైన పేలుడు పదార్థాన్ని మదర్‌బోర్డులో అమర్చిందని హెజ్‌బొల్లా, లెబనాన్ భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
పేల్చేందుకు శత్రువు పంపిన కోడ్‌ను మదర్ బోర్డ్ అందుకున్నాక పేజర్‌లోని పేలుడు పదార్థం క్రియాశీలమై పేలిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేజర్‌లను నెలల తరబడి వాడుతున్నా వాటిలోని పేలుడు పదార్థాన్ని హెజ్‌బొల్లా వర్గాలు గుర్తించకపోవడం తీవ్ర భద్రతావైఫల్యంగా చెబుతున్నారు. ఆ పేజర్లను మొదట్లో స్కాన్ చేసినపుడు ఎలాంటి పేలుడు పదార్థం జాడ కనిపించలేదని వారు చెబుతున్నారు.
అయితే ఈ పేజర్లను హంగేరీకి చెందిన ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్‌టీ’ అనే సంస్థ రూపొందించిందని ఆ బ్రాండ్ యజమాని గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు హుసు చింగ్–కువాంగ్ తెలిపారు. ‘ఏఆర్–924 అనే బ్రాండ్ మాత్రమే మాది. ఆ బ్రాండ్ పేరుతో ఉన్న ఉత్పత్తి మాది కాదు. ఆ బ్రాండ్ పేరును వాడుకునేందుకు బీఏసీకి అనుమతి ఇచ్చాం. ఈ మేరకు మూడేళ్లక్రితం ఒప్పందం కుదిరింది’’ అని చింగ్‌కువాంగ్ బుధవారం చెప్పారు. అయితే బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్‌టీ అనేది ఒక డొల్లకంపెనీ అని వార్తలొచ్చాయి. హంగేరీలోని బుడాపెస్ట్ నగరంలో సంస్థ ప్రధాన కార్యాలయం ఒక జనావాస అపార్ట్‌మెంట్‌లో ఉంది. అక్కడ ఒక కిటికీకి బీఏసీ కన్సల్టింగ్ అనే స్టిక్కర్ తప్పితే అక్కడ ఏమీ లేదని అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు తేల్చారు.
గతంలోనూ సాంకేతికతను వాడిన ఇజ్రాయెల్
పేజర్‌కాకుండా గతంలో ఇలాగే వస్తువుల్లో పేలుడు పదార్థాలను అమర్చి శత్రువులను అంతంచేసిన చరిత్ర మొస్సాద్‌కు ఉంది. టెక్నాలజీ సాయంతో పేలుళ్లు జరిపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. 1996లో హమాస్ కీలక బాంబ్‌మేకర్ యాహ్యా అయాస్‌ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ పేలుడు పదార్థాన్ని మొబైల్ ఫోన్‌లో అమర్చింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్‌బెట్ గతంలో యాహ్యా ఫోన్‌లో 15 గ్రాముల ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాన్ని నింపింది. తండ్రికి అయాష్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడేది అయాష్ అని నిర్ధారించుకున్నాక దానిని పేల్చి అయాస్‌ను అంతంచేశారు.
రిమోట్ ద్వారా నియంత్రించే కృత్రిమమేధతో పనిచేసే మిషిన్‌గన్‌తో ఇరాన్ అణు శాస్త్రవేత్త, ఉప రక్షణ మంత్రి మోసెన్ ఫక్రిజాదేను 2020లో హతమార్చింది. ఇజ్రాయెల్ 2021లో ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లను హ్యాక్ చేసి దేశవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభింపజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌లోని రెండు ప్రధాన గ్యాస్ పైప్‌లైన్లను పేల్చి పలు నగరాల సేవలకు అంతరాయం కలిగించింది. జూలైలో టెహ్రాన్‌లోని ఒక అతిథిగృహంలోని గదిలో నెలల క్రితమే శక్తివంతమైన బాంబును అమర్చి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment