walkie talkies
-
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అకీల్ మృతి?
బీరుట్: వాకీటాకీల పేలుళ్లతో మొదలైన ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఘర్షణ రోజురోజుకూ క్షిపణులు, డ్రోన్ల దాడులతో మరింత ముదురుతోంది. శుక్రవారం తమ ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై హెజ్బొల్లా దాడులు చేసినందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ దేశ రాజధాని బీరుట్ నగర సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం సాయంత్రం బీరుట్కు దక్షిణాన ఉన్న దహియే జిల్లాలోని జన సమ్మర్ద జామాస్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో 12 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 66 మంది గాయపడ్డారు. హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ఈ ప్రాంతంపై జరిగిన ఈ దాడిలో ఒక బహుళ అంతస్తుల భవంతి నేలమట్టమైంది. మృతుల సంఖ్య పెరిగే వీలుంది. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ అధికారి, ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సైతం చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. అకీల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ప్రకటించింది. హెజ్బొల్లా ‘రద్వాన్ ఫోర్స్’ సాయుధ యూనిట్‌తో ఇతను సమావేశం అయిన సందర్భంగా దాడి చేసి అంతమొందించామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి అవిచాయ్ అడ్రేయీ చెప్పారు. అయితే అకీల్, ఇతర కమాండర్ల మరణాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. అయితే అదే ప్రాంతంలో అకీల్ ఉన్నమాట వాస్తవమేనని హెజ్బొల్లా అధికార ప్రతినిధి చెప్పారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జూలైలో జరిపిన దాడుల్లో సీనియర్ హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ చనిపోయారు. 170 రాకెట్లతో విరుచుకుపడిన హెజ్బొల్లాహెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాహ్ గురువారం టెలివిజన్ ప్రసంగం వేళ తమ రాకెట్ లాంఛర్లను ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసినందుకు ప్రతిగా హెజ్బొల్లా శుక్రవారం ఉదయం ఉత్తర ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ స్థావరాలు, బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపైకి హెజ్బొల్లా పలు దఫాల్లో 170 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇందులో జరిగిన ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎవరీ ఇబ్రహీం అకీల్? రద్వాన్ ఫోర్స్ ఆపరేషన్స్ కమాండర్. గతంలో హెజ్బొల్లా అత్యున్నత సాయుధ విభాగం ‘జిహాద్ కౌన్సిల్’ సభ్యుడు. ఇతనిపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, నావికాదళ బ్యారెక్‌లపై ఉగ్రదాడుల్లో 300 మందికిపైగా చనిపోయారు. వీటిలో అకీల్ పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. 1980 దశకంలో కొందరు జర్మన్లు, అమెరికన్లను బంధించాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. తహ్సీన్ అనే మారుపేరుతో తిరిగే ఇతని వివరాలు చెప్పినా, పట్టిచి్చనా రూ.58 కోట్లు ఇస్తానని గతేడాది అమెరికా నజరానా ప్రకటించింది. 2019లోనే ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. -
సహించరాని ఉన్మాదం
ముందు ఇరుగుపొరుగుతో... ఆ తర్వాత పశ్చిమాసియా దేశాలన్నిటితో ఉన్మాద యుద్ధానికి ఇజ్రా యెల్ సిద్ధపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలూ, దేశాలూ ఈ మాదిరిగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతే ఇది కాస్తా ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం లేకపోలేదని మంగళ, బుధవారాల్లో లెబనాన్, సిరియాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలియజెబుతున్నాయి. వరసగా రెండురోజులపాటు పేజర్లనూ, వాకీటాకీలనూ, ఇళ్లల్లో వినియోగించే సౌరశక్తి ఉపకరణా లనూ పేల్చటం ద్వారా సాగించిన ఆ దాడుల్లో 37 మంది మరణించగా నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.లెబనాన్‌లో హిజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయటానికే ఈ దాడులు చేసినట్టు కనబడుతున్నదని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు అర్ధసత్యం మాత్రమే. ప్రాణాలు కోల్పోయినవారిలో మిలిటెంట్లతోపాటు పసిపిల్లలూ, అమాయక పౌరులూ, ఆరోగ్యసేవా కార్య కర్తలూ ఉన్నారు. హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మాత్రమే కాదు... అదొక రాజకీయ పక్షం, ధార్మికసంస్థ. కనుక ఆ పేజర్లు సామాన్య పౌరులకూ చేరివుండొచ్చు.గాజాలో దాదాపు ఏడాదిగా మారణ హోమం సాగుతోంది. దాన్ని ఆపటానికీ, శాంతియుత పరిష్కారం సాధించటానికీ ఎవరూ చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు. మొన్న ఫిబ్రవరిలో అమెరికా వైమానిక దళ సీనియర్ ఎయిర్మాన్ ఆరోన్ బుష్నెల్ ఆత్మాహుతి చేసుకునేముందు ఫేస్బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సందేశం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. కళ్లెదుట మారణ హోమం సాగుతుంటే ప్రపంచం నిర్లిప్తంగా మిగిలిపోవటాన్ని... తన చేతులకూ నెత్తురంటడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆ సందేశంలో ఆయన రాశాడు. అమెరికాకు చీమ కుట్టినట్టయినా లేదు. లెబనాన్, సిరియాల్లో జరిగిన దాడులపై ఒక మీడియా సమావేశంలో పదే పదే ప్రశ్నించినా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ జవాబిచ్చేందుకు నిరాకరించటం దీన్నే ధ్రువపరుస్తోంది. ఉగ్రవాదానికి విచక్షణ ఉండదు. తన విధ్వంసకర చర్యలు ఎవరికి చేటు చేస్తాయన్న ఆలోచన ఉండదు. వ్యక్తులు ఇలాంటి ఉన్మాదానికి లోనయితే జరిగే నష్టంకన్నా రాజ్యాలు ఉగ్రవాదాన్నిఆశ్ర యిస్తే కలిగే నష్టం అనేక వందల రెట్లు ఎక్కువ. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అలాంటిధూర్త రాజ్యాలు వేరే దేశాలపై సైతం ఆ మాదిరిగానే దుందుడుకు చర్యలకు దిగి ప్రపంచాన్నిపాదాక్రాంతం చేసుకోవటానికి కూడా సిద్ధపడతాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను అందరూ వ్యతిరేకించింది అందుకే. ఒక దేశాన్ని దురాక్రమించి, అక్కడి పౌరులకు కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేస్తూ అందుకు ప్రతిఘటన ఉండకూడదనుకోవటం తెలివి తక్కువతనం. పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడి, చివరకు ఒప్పందం కుదరబోతున్న దశలో సైతం అడ్డం తిరిగి మొండికేసిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. అంతేకాదు... ఇరుగుపొరుగు దేశాలతో తరచు గిల్లికజ్జాలకు దిగటంతోపాటు ఇథియోపియా, ఉగాండా, నైజర్, కెన్యావంటి సబ్ సహారా దేశాల, లాటిన్ అమె రికా దేశాల నియంతలకు ఆయుధాలిచ్చి అండదండలందించిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. చూస్తూ ఉంటే మేస్తూ పోయినట్టు ప్రపంచం స్థాణువై మిగిలిపోతే ఈ అరాచకాలకు అంతంఉండదు. సమస్య ఉన్నదని గుర్తించటం దాని పరిష్కారానికి తొలి మెట్టు. కానీ ఇంతవరకూ అమెరికాగానీ, దానికి వంతపాడుతున్న యూరప్ దేశాలుగానీ అసలు పాలస్తీనా అనేది సమస్యే కానట్టు నటిస్తున్నాయి. తాజాగా జరిగిన పేలుళ్ల వెనకున్న కుట్రలో ఇప్పుడు అందరి అనుమానమూ పాశ్చాత్య ప్రపంచంపై పడింది. ముఖ్యంగా హంగెరీ, బల్గేరియా దేశాల సంస్థల పాత్ర గురించి అందరూ ఆరా తీస్తున్నారు. పేజర్లను తాము తయారుచేయటం లేదనీ, హంగెరీలోని బీఏసీ అనే సంస్థ తమ లోగోను వాడుకుని ఉత్పత్తి చేస్తోందనీ తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ అంటున్నది. ఇందుకు తమకు పశ్చిమాసియా దేశంనుంచి నగదు ముడుతున్నదని సంస్థ వివరించింది. హంగెరీ మీడియా సంస్థ కథనం ఇంకా విచిత్రంగా ఉంది. అది చెప్తున్న ప్రకారం బీఏసీ కాదు, బల్గేరియాలోని నోర్టా గ్లోబల్ అనే సంస్థ ఈ పేజర్లను సరఫరా చేసిందట. బీఏసీకి ఉత్పాదక సామర్థ్యంలేదనీ, అది కేవలం ఒక ఏజెంటు మాత్రమే ఉండే కన్సెల్టింగ్ ఏజెన్సీ అనీ హంగెరీ ప్రభుత్వం చెబుతోంది. ఇక బల్గేరియా అయితే అసలు పేజర్ల ఉత్పాదక సంస్థ తమ గడ్డపైనే లేదంటున్నది. ప్రజల ప్రాణాలు తీసే దుష్ట చర్యకు పాల్పడి నేరం తాలూకు ఆనవాళ్లు మిగల్చకపోవటం, అది ఘనకార్యమన్నట్టుసంబరపడటం ఉగ్రవాద సంస్థల స్వభావం. దాన్నే ఇజ్రాయెల్ కూడా అనుకరిస్తూ పైచేయి సాధించానని భ్రమపడుతున్నట్టుంది. కానీ ఈ మాదిరి చర్యలు మరింత ప్రతీకార వాంఛను పెంచుతాయి తప్ప దాని స్థానాన్ని పదిలం చేయలేవు.ఇంతవరకూ పేలుళ్ల బాధ్యత తనదేనని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. తమ శత్రువు ఎక్కడున్నా వెదికి వెదికి పట్టుకుని మట్టుబెట్టడం, అందుబాటులో ఉన్న సాంకేతికతలను అందుకు వాడుకోవటం ఇజ్రాయెల్‌కు కొత్తగాదు. ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి చొరబడి మాల్వేర్ను ప్రవేశ పెట్టడం, పౌరుల గోప్యతకు భంగం కలిగించటం, కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్లు పేలిపోయేలా చేయటం ఇజ్రాయెల్ సంస్థల నిర్వాకమే. మిత్రపక్షం కదా అని ధూర్త రాజ్యాన్ని ఉపేక్షిస్తే అదిప్రపంచ మనుగడకే ముప్పు కలిగిస్తుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ చర్యలు సారాంశంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ఉల్లంఘన. అందుకు పర్యవసానం లేకపోతే శతాబ్దాలుగా మానవాళి సాధించుకున్న నాగరిక విలువలకు అర్థం లేదు. -
Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి
బీరుట్: లెబనాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వాకీటాకీలు, పేజర్ల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. ఇక, తాజాగా వాకీటాకీల పేలుళ్ల కారణంగా దాదాపు 32 మంది మృతిచెందగా.. 450 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బుధవారం పలుచోట్ల పేజర్లు పేలిన ఘటనలో దాదాపు 13 మంది మృత్యువాతపడగా 2800 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాగా, బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితోపాటు సౌర పరికరాలనూ పేలుళ్లకు వినియోగించుకున్నారు. పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో ఇలా మరో పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది. వైర్లెస్ పరికరాలైన పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఈ పరికరాల హ్యాకింగ్ ఎలా జరిగింది అనేది కీలకంగా మారింది. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్‌లో కారుతోపాటు ఒక దుకాణంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బీరుట్‌లోని పలు ఇళ్లలో సౌర పరికరాలూ పేలిపోయాయి. హిజ్బుల్లా గ్రూపునకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలూ పేలాయి. ఇక.. ఇజ్రాయెలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్యల మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.#Pager After pager now Walkie-talkies explode at funeral held for pager victims.Pakistan condemned the attack.#Lebanon pic.twitter.com/pVMV3zQE0K— kiran parmar (@kiranaparmar72) September 19, 2024 అయితే, లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తయారయ్యాయి. వాటిపై ఐకామ్ అని ఉంది. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. కాగా, లెబనాన్‌లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామని ఐకామ్ వెల్లడించింది. ఇక, ఇవి చేతితో పట్టుకునే విధంగా రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హిజ్బోల్లా ఐదు నెలల కిందట కొనుగోలు చేసింది. ఇక, తాజాగా ఈ పరికరాలు పేలిన కారణంగా భారీ నష్టం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై భీకరంగా దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్త తరహా దాడులో లెబనాన్‌పై విరుచుకుపడుతోందని పలువురు చెబుతున్నారు. అందులో భాగంగా ఇలా అనూహ్య పేలుళ్ల ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ తన సైనికులతో యుద్ధం మరో అంకంలోకి ప్రవేశించిందని, మరింత ధైర్యం, అంకిత భావం అవసరమని సూచించారు. సైన్యం సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లోకి భారీగా సైన్యాన్ని ఇజ్రాయెల్ తరలిస్తోంది. All types of electric devices owned by Hezbollah are now blowing up in #Lebanon and the region.Apart from pagers & walkie-talkies, other devices such as fingerprint devices, solar power, radios, phones, batteries are now exploding too. #LebanonBlastpic.twitter.com/FIm5RH9UpA— Arun Pudur (@arunpudur) September 18, 2024ఇది కూడా చదవండి: ట్రంప్‌కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన యూనియన్ -
Israel Hezbollah War: నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు
బీరుట్: వాకీటాకీలు, సౌర విద్యుత్ వ్యవస్థల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌పై భీకర భూతల, గగనతల దాడులతో తెగబడిన ఇజ్రాయెల్ తాజా తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిందని బుధవారం నాటి అనూహ్య పేలుళ్ల స్పష్టమైంది. హెజ్బొల్లా సాయుధులు విరివిగా వాడే పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో బుధవారం వాకీటాకీలు, సౌరవిద్యుత్ వ్యవస్థలు పేలిపోయాయి. ఈ అనూహ్య పేలుళ్ల ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేజర్ల పేలుళ్లతో 13 మంది చనిపోయి 2,800 మంది రక్తమోడిన తరుణంలో మరో ‘సాంకేతిక’ పేలుళ్ల పర్వానికి దిగి ఇజ్రాయెల్ కొత్త యుద్ధతంత్రానికి తెరలేపిందని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో దాదాపు మొత్తం భూభాగాన్ని జల్లెడపట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన లక్ష్యాన్ని లెబనాన్‌కు మార్చుకుందని తాజా ఉదంతం చాటుతోంది. అంతిమయాత్ర వేళ పేలుళ్లు పేజర్ల పేలుళ్లలో మరణించిన ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు, ఒక చిన్నారి అంతిమయాత్రలు బీరుట్ శివారులోని దహియేలో కొనసాగుతున్నపుడే వాకీటాకీలు పేలడం గమనార్హం. ‘‘బీరుట్లో చాలా చోట్ల వాకీటాకీలు పేలాయి. ఎల్రక్టానిక్ పరికరాలు పేలిన ఘటనల్లో 9 మంది చనిపోయారు’’ అని లెబనాన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. బీరుట్ నగరంతోపాటు లెబనాన్‌లో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయని హెచ్»ొల్లా ప్రతినిధులు చెప్పారు. వాయవ్య తీర పట్టణమైన సిడాన్లో ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ దుకాణం వాకీటాకీల పేలుడుకు ధ్వంసమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్తమోడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పోటెత్తుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి. ‘‘ఇలాంటిది నేనెప్పడూ చూడలేదు. గాయపడిన వారిలో చాలా మందికి చేతివేళ్లు తెగిపోయాయి. కళ్లు దెబ్బతిన్నాయి’’ అని బీరుట్‌లోని దీయూ ఆస్పత్రిలో వైద్యురాలు నౌర్ ఎల్ ఓస్తా చెప్పారు. ‘‘ వరుస అనూహ్య పేలుళ్లతో ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యంపోస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.దాడికి ఇదే సరైన సమయమా? వేలాది మంది హెజ్బొల్లా సైనికులు గాయాలపాలై ఆస్పత్రులకు పరిమితమయ్యారు. పేజర్ల పేలుడుతో హెజ్బొల్లాలో కమ్యూనికేషన్ నెట్వర్క్ కోలుకోనంతగా దెబ్బతింది. వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లతో పౌరుల్లో ఆందోళనల నడుమ దేశంలో శాంతిభద్రతలపై లెబనాన్ దృష్టిపెట్టాల్సిఉంది. ఈ తరుణంలో దాడి చేస్తే శత్రువును భారీగా దెబ్బ కొట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గడ్డపై వరుస పేలుళ్లతో ఆగ్రహించిన లెబనాన్, హెజ్బొల్లా సాయుధాలు దాడులకు తెగబడొచ్చన్న ఇజ్రాయెల్ భావించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రాయెల్ అదనపు బలగాలను తరలించింది. అక్టోబర్ 8న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దమనకాండ మొదలైననాటి నుంచి ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది. ఉద్రిక్తతలను ఆపండి: ఐరాస లెబనాన్ వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తచేసింది. ‘‘ పరిస్థితి చేయిదాట కుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ‘‘ బందీలను విడిచిపెట్టి శాంతి స్థాపనకు కట్టుబడాలి. ఎల్రక్టానిక్ పరికరాల పేలుళ్లకు పాల్పడటం చూస్తుంటే ఇది భారీ సైనిక చర్యకు కసరత్తులా తోస్తోంది’’ అని గుటెరస్ వ్యాఖ్యానించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ చెప్పారు. యుద్ధంలో కొత్త దశ మొదలైంది: ఇజ్రాయెల్వాకీటాకీల ఉదంతం తర్వాత రమాట్ డేవిడ్ వైమానిక స్థావరంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో కొత్త దశకు తెరలేపుతున్నాం. యుద్ధక్షేత్ర కేంద్ర స్థానం ఉత్తరం నుంచి దిశ మార్చుకుంటోంది. మాకు ఇప్పుడు స్థిరత్వం అవసరం. బలగాలు, వనరులను వేరే లక్ష్యం వైపు వినియోగించే అవకాశముంది. బుధవారం అద్భుత ఫలితాలు సాధించాం’’ అని సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హెజ్బొల్లాపై అదనపు దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో లెబనాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోందని అర్థమవుతోంది. కాగా, వరుస పేలుళ్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఐరాస మానవహక్కుల సంస్థ చీఫ్ వోకర్ టర్క్ డిమాండ్‌చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
భీమవరానికి వాకీటాకీలు
వాకీటాకీ.. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో విధినిర్వహణలో ఉపయోగిస్తున్న సాధనం. సమాచారం వేగంగా ఎక్కువమందికి అందించడానికి, సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది. ఇదే విధానాన్ని భీమవరం మున్సిపాలిటీలో కూడా అమలులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో సిబ్బందికి త్వరలో వాకీటాకీలు అందుబాటులోకి రానున్నాయి. పాలన పరంగా, మౌలిక వసతులైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఇతర ఏ సమస్య ఉన్నా వేగంగా అధికారులు, సిబ్బంది స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా వీటిని వినియోగించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచన మేరకు మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీకి 80 వాకీటాకీల కోసం రూ.25 లక్షల నిధుల మంజూరు కోసం ప్రతిపాదించారు. మే మొదటి వారంలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని కమిషనర్ చెబుతున్నారు. ఎలా ఉపయోగపడతాయంటే.. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో 46 సచివాలయాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్కటి చొప్పున వాకీటాకీలు అందిస్తారు. ఆయా వార్డుల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు సచివాలయ సిబ్బందికి గాని, అధికారులకు నేరుగా గాని తెలియజేసినప్పుడు ఆ సమస్య సత్వర పరిష్కారం కోసం సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు వాకీటాకీలను ఉపయోగిస్తారు. ఏదైనా అగ్నిప్రమాదం, తుపానులు, వరదల సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించాల్సిన సమయాల్లో ఉన్నతాధికారులకు వాకీటాకీ ద్వారా సచివాలయ సిబ్బంది సమాచారం తెలియజేసి సాయం అందేలా చేయడానికి వీటిని వినియోగిస్తారు. తద్వారా ఉన్నతాధికారులు సత్వర ఆదేశాలు జారీ చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. మున్సిపల్ కమిషనర్, సెక్షన్ ముఖ్య అధికారులు ప్రతిరోజూ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో వారిని అప్రమత్తం చేయడానికి, పాలన పరంగా సేవలు వేగవంతం చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఏదైనా సమాచారం అందరికీ ఒకేసారి చేరడం ఇందులో ప్రధాన సౌలభ్యం. సచివాలయాల్లో విధుల్లో ఉండే ఇమ్యూనిటీ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు, ఇతర సిబ్బంది వీటిని వినియోగించేందుకు అవకాశముంటుంది. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వద్ద కూడా వాకీటాకీలు ఉండటం వల్ల సమస్య వెంటనే వారి దృష్టికి వెళుతుంది. జిల్లాలో మొట్టమొదటిగా.. వాకీటాకీల వ్యవస్థ నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటీ తొలిసారిగా వినియోగించనుంది. 20 ఏళ్ల క్రితం ఇదే మున్సిపాలిటీ వాకీటాకీలను ఉపయోగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, సిబ్బంది పుష్కలంగా అందుబాటులో ఉండటంతో వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. భీమవరం పట్టణంలో అత్యంత ఎత్తులో ఉండే బీఎస్ఎన్ఎల్ లేదా ప్రైవేట్ టవర్లకు అనుసంధానం చేసి నిరంతరం సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా వాకీటాకీలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. మే మొదటి వారంలోనే.. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచన మేరకు మున్సిపాలిటీలో సమస్యల సత్వర పరిష్కారం కోసం వాకీటాకీలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. వీటికోసం ప్రతిపాదనలు పంపించాం. మే మొదటివారంలోనే వాకీటాకీలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్.శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్, భీమవరం