ముందు ఇరుగుపొరుగుతో... ఆ తర్వాత పశ్చిమాసియా దేశాలన్నిటితో ఉన్మాద యుద్ధానికి ఇజ్రా యెల్ సిద్ధపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలూ, దేశాలూ ఈ మాదిరిగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతే ఇది కాస్తా ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం లేకపోలేదని మంగళ, బుధవారాల్లో లెబనాన్, సిరియాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలియజెబుతున్నాయి. వరసగా రెండురోజులపాటు పేజర్లనూ, వాకీటాకీలనూ, ఇళ్లల్లో వినియోగించే సౌరశక్తి ఉపకరణా లనూ పేల్చటం ద్వారా సాగించిన ఆ దాడుల్లో 37 మంది మరణించగా నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.
లెబనాన్‌లో హిజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయటానికే ఈ దాడులు చేసినట్టు కనబడుతున్నదని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు అర్ధసత్యం మాత్రమే. ప్రాణాలు కోల్పోయినవారిలో మిలిటెంట్లతోపాటు పసిపిల్లలూ, అమాయక పౌరులూ, ఆరోగ్యసేవా కార్య కర్తలూ ఉన్నారు. హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మాత్రమే కాదు... అదొక రాజకీయ పక్షం, ధార్మికసంస్థ. కనుక ఆ పేజర్లు సామాన్య పౌరులకూ చేరివుండొచ్చు.
గాజాలో దాదాపు ఏడాదిగా మారణ హోమం సాగుతోంది. దాన్ని ఆపటానికీ, శాంతియుత పరిష్కారం సాధించటానికీ ఎవరూ చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు. మొన్న ఫిబ్రవరిలో అమెరికా వైమానిక దళ సీనియర్ ఎయిర్‌మాన్ ఆరోన్ బుష్నెల్ ఆత్మాహుతి చేసుకునేముందు ఫేస్‌బుక్‌లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సందేశం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది.
కళ్లెదుట మారణ హోమం సాగుతుంటే ప్రపంచం నిర్లిప్తంగా మిగిలిపోవటాన్ని... తన చేతులకూ నెత్తురంటడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆ సందేశంలో ఆయన రాశాడు. అమెరికాకు చీమ కుట్టినట్టయినా లేదు. లెబనాన్, సిరియాల్లో జరిగిన దాడులపై ఒక మీడియా సమావేశంలో పదే పదే ప్రశ్నించినా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ జవాబిచ్చేందుకు నిరాకరించటం దీన్నే ధ్రువపరుస్తోంది.
ఉగ్రవాదానికి విచక్షణ ఉండదు. తన విధ్వంసకర చర్యలు ఎవరికి చేటు చేస్తాయన్న ఆలోచన ఉండదు. వ్యక్తులు ఇలాంటి ఉన్మాదానికి లోనయితే జరిగే నష్టంకన్నా రాజ్యాలు ఉగ్రవాదాన్నిఆశ్ర యిస్తే కలిగే నష్టం అనేక వందల రెట్లు ఎక్కువ. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అలాంటిధూర్త రాజ్యాలు వేరే దేశాలపై సైతం ఆ మాదిరిగానే దుందుడుకు చర్యలకు దిగి ప్రపంచాన్నిపాదాక్రాంతం చేసుకోవటానికి కూడా సిద్ధపడతాయి.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌లను అందరూ వ్యతిరేకించింది అందుకే. ఒక దేశాన్ని దురాక్రమించి, అక్కడి పౌరులకు కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేస్తూ అందుకు ప్రతిఘటన ఉండకూడదనుకోవటం తెలివి తక్కువతనం. పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడి, చివరకు ఒప్పందం కుదరబోతున్న దశలో సైతం అడ్డం తిరిగి మొండికేసిన చరిత్ర ఇజ్రాయెల్‌ది.
అంతేకాదు... ఇరుగుపొరుగు దేశాలతో తరచు గిల్లికజ్జాలకు దిగటంతోపాటు ఇథియోపియా, ఉగాండా, నైజర్, కెన్యావంటి సబ్ సహారా దేశాల, లాటిన్ అమె రికా దేశాల నియంతలకు ఆయుధాలిచ్చి అండదండలందించిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. చూస్తూ ఉంటే మేస్తూ పోయినట్టు ప్రపంచం స్థాణువై మిగిలిపోతే ఈ అరాచకాలకు అంతంఉండదు. సమస్య ఉన్నదని గుర్తించటం దాని పరిష్కారానికి తొలి మెట్టు. కానీ ఇంతవరకూ అమెరికాగానీ, దానికి వంతపాడుతున్న యూరప్ దేశాలుగానీ అసలు పాలస్తీనా అనేది సమస్యే కానట్టు నటిస్తున్నాయి.
తాజాగా జరిగిన పేలుళ్ల వెనకున్న కుట్రలో ఇప్పుడు అందరి అనుమానమూ పాశ్చాత్య ప్రపంచంపై పడింది. ముఖ్యంగా హంగెరీ, బల్గేరియా దేశాల సంస్థల పాత్ర గురించి అందరూ ఆరా తీస్తున్నారు. పేజర్లను తాము తయారుచేయటం లేదనీ, హంగెరీలోని బీఏసీ అనే సంస్థ తమ లోగోను వాడుకుని ఉత్పత్తి చేస్తోందనీ తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ అంటున్నది. ఇందుకు తమకు పశ్చిమాసియా దేశంనుంచి నగదు ముడుతున్నదని సంస్థ వివరించింది. హంగెరీ మీడియా సంస్థ కథనం ఇంకా విచిత్రంగా ఉంది. అది చెప్తున్న ప్రకారం బీఏసీ కాదు, బల్గేరియాలోని నోర్టా గ్లోబల్ అనే సంస్థ ఈ పేజర్లను సరఫరా చేసిందట.
బీఏసీకి ఉత్పాదక సామర్థ్యంలేదనీ, అది కేవలం ఒక ఏజెంటు మాత్రమే ఉండే కన్సెల్టింగ్ ఏజెన్సీ అనీ హంగెరీ ప్రభుత్వం చెబుతోంది. ఇక బల్గేరియా అయితే అసలు పేజర్ల ఉత్పాదక సంస్థ తమ గడ్డపైనే లేదంటున్నది. ప్రజల ప్రాణాలు తీసే దుష్ట చర్యకు పాల్పడి నేరం తాలూకు ఆనవాళ్లు మిగల్చకపోవటం, అది ఘనకార్యమన్నట్టుసంబరపడటం ఉగ్రవాద సంస్థల స్వభావం. దాన్నే ఇజ్రాయెల్ కూడా అనుకరిస్తూ పైచేయి సాధించానని భ్రమపడుతున్నట్టుంది. కానీ ఈ మాదిరి చర్యలు మరింత ప్రతీకార వాంఛను పెంచుతాయి తప్ప దాని స్థానాన్ని పదిలం చేయలేవు.
ఇంతవరకూ పేలుళ్ల బాధ్యత తనదేనని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. తమ శత్రువు ఎక్కడున్నా వెదికి వెదికి పట్టుకుని మట్టుబెట్టడం, అందుబాటులో ఉన్న సాంకేతికతలను అందుకు వాడుకోవటం ఇజ్రాయెల్‌కు కొత్తగాదు. ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి చొరబడి మాల్‌వేర్‌ను ప్రవేశ పెట్టడం, పౌరుల గోప్యతకు భంగం కలిగించటం, కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్లు పేలిపోయేలా చేయటం ఇజ్రాయెల్ సంస్థల నిర్వాకమే.
మిత్రపక్షం కదా అని ధూర్త రాజ్యాన్ని ఉపేక్షిస్తే అదిప్రపంచ మనుగడకే ముప్పు కలిగిస్తుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ చర్యలు సారాంశంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ఉల్లంఘన. అందుకు పర్యవసానం లేకపోతే శతాబ్దాలుగా మానవాళి సాధించుకున్న నాగరిక విలువలకు అర్థం లేదు.
Comments
Please login to add a commentAdd a comment