12 మంది మృతి ∙ 66 మందికి గాయాలు
బీరుట్: వాకీటాకీల పేలుళ్లతో మొదలైన ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఘర్షణ రోజురోజుకూ క్షిపణులు, డ్రోన్ల దాడులతో మరింత ముదురుతోంది. శుక్రవారం తమ ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై హెజ్బొల్లా దాడులు చేసినందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ దేశ రాజధాని బీరుట్ నగర సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం సాయంత్రం బీరుట్‌కు దక్షిణాన ఉన్న దహియే జిల్లాలోని జన సమ్మర్ద జామాస్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో 12 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ దాడుల్లో 66 మంది గాయపడ్డారు. హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ఈ ప్రాంతంపై జరిగిన ఈ దాడిలో ఒక బహుళ అంతస్తుల భవంతి నేలమట్టమైంది. మృతుల సంఖ్య పెరిగే వీలుంది. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ అధికారి, ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సైతం చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. అకీల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ప్రకటించింది.
హెజ్బొల్లా ‘రద్వాన్ ఫోర్స్’ సాయుధ యూనిట్‌తో ఇతను సమావేశం అయిన సందర్భంగా దాడి చేసి అంతమొందించామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి అవిచాయ్ అడ్రేయీ చెప్పారు. అయితే అకీల్, ఇతర కమాండర్ల మరణాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. అయితే అదే ప్రాంతంలో అకీల్ ఉన్నమాట వాస్తవమేనని హెజ్బొల్లా అధికార ప్రతినిధి చెప్పారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జూలైలో జరిపిన దాడుల్లో సీనియర్ హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ చనిపోయారు.
170 రాకెట్లతో విరుచుకుపడిన హెజ్బొల్లా
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాహ్ గురువారం టెలివిజన్ ప్రసంగం వేళ తమ రాకెట్ లాంఛర్లను ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసినందుకు ప్రతిగా హెజ్బొల్లా శుక్రవారం ఉదయం ఉత్తర ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ స్థావరాలు, బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపైకి హెజ్‌బొల్లా పలు దఫాల్లో 170 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇందులో జరిగిన ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఎవరీ ఇబ్రహీం అకీల్?
రద్వాన్ ఫోర్స్ ఆపరేషన్స్ కమాండర్. గతంలో హెజ్బొల్లా అత్యున్నత సాయుధ విభాగం ‘జిహాద్ కౌన్సిల్’ సభ్యుడు. ఇతనిపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, నావికాదళ బ్యారెక్‌లపై ఉగ్రదాడుల్లో 300 మందికిపైగా చనిపోయారు. వీటిలో అకీల్ పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. 1980 దశకంలో కొందరు జర్మన్లు, అమెరికన్లను బంధించాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. తహ్‌సీన్ అనే మారుపేరుతో తిరిగే ఇతని వివరాలు చెప్పినా, పట్టిచి్చనా రూ.58 కోట్లు ఇస్తానని గతేడాది అమెరికా నజరానా ప్రకటించింది. 2019లోనే ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment