జెరూసలేం: మిలిటెంట్ గ్రూప్ హెజ్‌బొల్లాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హెజ్‌బొల్లా టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.
‘దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా నాసర్ బ్రిగేడ్ రాకెట్ యూనిట్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్. 2023 నుంచి ఇజ్రాయెల్‌పై పలుమార్లు జరిగిన దాడుల్లో జాఫర్ ఖాదర్ ఫార్ కీలక పాత్రపోషించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్‌లోని గోలాన్ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో 12మందికి పైగా మరణించారు. 30మంది గాయపడ్డారు. గత బుధవారం హెజ్‌బొల్లా మెటుల్లాపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో మరణించారు. ఈ దాడులకు సూత్రదారి జాఫర్ ఖాదర్ ఫార్’ అని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.
అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను హెజ్‌బొల్లా చేపట్టింది. ఇతని ఆధ్వర్యంలోనే ఆ దాడులు చోటుచేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.
ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్ హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ పేర్కొంది. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్‌బొల్లా ఆపరేటివ్ ఎవరనేది వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు అపహరించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment