తీసే కొద్దీ గుట్టలుగా బయటపడుతున్న మృతదేహాలు
కేరళ విలయ ఘటనలో 289కి చేరిన మరణాల సంఖ్య
ముమ్మర గాలింపు చర్యల్లో ఆర్మీ
వయనాడ్(కేరళ): కనీవిని ఎరుగని పెను విషాదం నుంచి కేరళ ఇంకా తేరుకోలేదు. మరుభూమిలా మారిన తమ సొంత భూమి నుంచి బయటకు తీస్తున్న ఆప్తుల పార్ధివదేహాలను చూసిన బంధువులు, స్నేహితుల ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య తాజాగా 289కి పెరిగింది.
ఇంకా 200 మందికిపైగా స్థానికుల జాడ గల్లంతైంది. కాలంతోపోటీపడుతూ సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, కోస్ట్‌గార్డ్, పోలీసు, స్థానిక యంత్రాంగం ముమ్మర గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే భీతావహంగా మారిన అక్కడి పరిసరాలు సహాయక చర్యలకు పెద్ద అవరోధంగా తయారయ్యాయి.
కూలిన వంతెనలు, కొట్టుకుపోయిన రోడ్లు, కొట్టుకొచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, బురదమయమై నేల, కూలిన చెట్లు, వరద ప్రవాహం, భారీ వర్షం మధ్య సహాయక చర్యలు కొనసాగించడం అక్కడి బృందాలకు పెద్ద సవాల్‌గా మారింది. కాగా, ఇప్పటివరకు 91 శిబిరాలకు 9,328 మందిని తరలించామని కేరళ రెవిన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. 225 మంది ఆస్పత్రుల్లో చేరగా 96 మందికి చికిత్స కొనసాగుతోంది.
ఇది జాతి విపత్తు: రాహుల్
గతంలో సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో జరిగిన ఈ ఘోర విపత్తు చూసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకా గాంధీ కేరళకు వచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించారు.
తర్వాత మేప్పాడిలోని ఆస్పత్రుల్లో క్షతగాత్రులను, సహాయక శిబిరాల్లో బాధితుల బంధువులను కలిసి పరామర్శించారు. ‘‘ఇది వయనాడ్, కేరళలో భారీ విషాదం నింపింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందాల్సిందే. కుటుంబసభ్యులు, సొంతిళ్లను కోల్పోయిన స్థానికులను చూస్తుంటే మాటలు రావడం లేదు.
సర్వం కోల్పోయిన వారిని ఎలా ఓదార్చాలో, వారికెలా ధైర్యం చెప్పాలో తెలీడం లేదు. ఇది జాతీయ విపత్తు’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఇంతటి మహా విషాదాన్ని చూస్తుంటే మా నాన్న చనిపోయిన సందర్భం గుర్తొస్తోంది. అయితే వీళ్లు తమ నాన్నను మాత్రమే కాదు.. మొత్తం కుటుంబాన్నే కోల్పోయారు. నేను బాధపడుతున్నదానికంటే అంతులేని విషాదం వీరి జీవితాల్లో ఆవహించింది. వయనాడ్ బాధితులకు అందరూ అండగా నిలబడటం గర్వించాల్సిన విషయం. దేశ ప్రజలు బాధితులకు ఆపన్నహస్తం అందిస్తారు’ అని రాహుల్ అన్నారు.
పారిపోదామనుకున్నా: వైద్యురాలి ఆవేదన
ధైర్యంగా పోస్ట్ మార్టమ్ చేసే వైద్యురాలు సైతం మృతదేహాలు ఛి ద్రమైన తీరు చూసి డాక్టర్ మనసు కకావికలమైన ఘటన వయనాడ్‌లోని స్థా నిక ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఇంతటి హృదయవిదారక దృశ్యాన్ని ఏనాడూ చూడలేదని బాధి తుల మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు గద్గద స్వరంతో చెప్పారు.
‘‘ ఎన్నో రకాల పోస్ట్‌మార్టమ్‌లు చేశాగానీ ఇలాంటివి ఇదే మొదలు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు శవపరీక్ష సమయంలో గుండెనిబ్బరంతో ఉంటారు. కానీ భారీ బండరాళ్లు పడిన ధాటికి దెబ్బతిన్న మృతదేహాలను చూశాక నాలో స్థైర్యం పోయింది. కొన్ని మృతదేహాలు పూర్తిగా చితికిపోయాయి. ఒకదానివెంట మరోటి తెస్తూనే ఉన్నారు.
ఎక్కువ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా రూపు కోల్పోయాయి. ఒక ఏడాది చిన్నారి మృతదేహం దారుణంగా దెబ్బతింది. ఇక నా వల్ల కాదు.. క్షతగాత్రుల సహాయక శిబిరానికి పారిపోదామనుకున్నా. కానీ ఇంకోదారిలేక వృత్తిధర్మం పాటిస్తూ 18 మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ చేశా. తర్వాత కేరళలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సర్జన్లు వచ్చారు. రాత్రి 11.30కల్లా 93 పోస్ట్‌మార్టమ్‌లు పూర్తిచేశాం. ఈ ఘటనను జీవితంలో మర్చిపోను’ అని వైద్యురాలు తన అనుభవాన్ని చెప్పారు.
కదిలొచ్చిన తల్లి హృదయం
తల్లులను కోల్పోయిన పసిపిల్లలు పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలను చూసిన ఒక తల్లి అనుకున్న తడవుగా వయనాడ్‌కు పయనమైంది. నాలుగు నెలల బిడ్డకు తల్లి అయిన ఆమె విషాదవార్త తెలియగానే వయనాడ్‌కు భర్త, పిల్లలతో కలిసి బయల్దేరారు. సెంట్రల్ కేరళలోని ఇడుక్కి నుంచి వస్తున్న ఆమెను మీడియా పలకరించింది.
‘‘ నాకూ చంటిబిడ్డ ఉంది. తల్లిపాల కోసం బిడ్డపడే ఆరాటం నాకు తెలుసు. అందుకే నా చనుబాలు ఇచ్చి అక్కడి అనాథలైన పసిబిడ్డల ఆకలి తీరుస్తా’ అని ఆమె అన్నారు. కాగా, కేరళ బాధితులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన సంతాప సందేశం పంపించారు. అవిశ్రాంతంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్మీని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment