9 రోజుల్లో కరోనా ఆస్పత్రి | China Pledged to Build a New Hospital in 10 Days | Sakshi
Sakshi News home page

9 రోజుల్లో కరోనా ఆస్పత్రి

Published Tue, Feb 4 2020 5:20 AM | Last Updated on Wed, Feb 5 2020 2:26 AM

China Pledged to Build a New Hospital in 10 Days - Sakshi

వుహాన్‌లో సిద్ధమైన వేయి పడకల హౌషెన్‌షాన్‌ ఆసుపత్రి

బీజింగ్‌/తిరువనంతపురం: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చైనా ప్రభుత్వం కఠోర యుద్ధం చేస్తోంది. అందుకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వుహాన్‌లో రికార్డుస్థాయిలో కేవలం తొమ్మిది రోజుల్లోనే 1000 పడకల భారీ ఆస్పత్రిని నిర్మించింది. అత్యంత అధునాతన వైద్య సదుపాయాలతో వుహాన్‌లో నిర్మించిన ఈ హౌషెన్‌షాన్‌ ఆసుపత్రిలో ఏకకాలంలో వేలమందికి చికిత్స అందించే ఏర్పాట్లు ఉన్నాయి.

గతంలో సార్స్‌ బారిన పడిన ప్రజలను కాపాడిన అనుభవం ఉన్న వైద్యులను ఇక్కడకు తీసుకొచ్చారు. చైనా సైన్యంలోని 1400 మంది అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందిని ఆసుపత్రిలో నియమించింది. సోమవారం ఈ ఆసుపత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత్, అమెరికాలతో కలిపి ఇప్పటికే 25 దేశాలకు పాకిన కరోనా వైరస్‌.. చైనాలో 17,205 మందికి సోకింది. ఆదివారం ఒక్కరోజే చైనాలో కరోనా మృతుల సంఖ్య 57గా నమోదైంది. ఇప్పటివరకు చైనాలో  మొత్తం 361 మంది వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. అయితే 475 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్టు చైనా అధికారులు వెల్లడించారు.  

కేరళలో మూడో కరోనా వైరస్‌ కేసు
ఇప్పటికే కేరళలో 2 కరోనా కేసులు గుర్తించగా తాజాగా మరో వ్యక్తికి వైరస్‌ ఉన్నట్లు తేలిందని కేరళ ఆరోగ్య మంత్రి శైలజ చెప్పారు. ఈ ముగ్గురూ ఇటీవలే చైనాలోని వుహాన్‌ నుంచి కేరళకు వచ్చారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే కావడం గమనార్హం. చైనాకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచించింది. చైనా నుంచే కాకుండా సింగపూర్, థాయ్‌లాండ్‌ల నుంచి ముం బైకి వచ్చిన ప్రయాణికులకు సైతం స్క్రీనింగ్‌ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వాధికారి వెల్లడించారు.  

అమెరికా అతిగా స్పందిస్తోంది: చైనా  
చైనాతో రాకపోకల నిషేధాలు, వ్యాపార సంబంధాలు, దౌత్యాధికారుల తరలింపులు లాంటి చర్యలతో అమెరికా అనవసర భయాందోళనలు రేకెత్తిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చన్నీంగ్‌ ఆరోపించారు. పైగా 361 మందిని బలిగొన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి కాపాడేందుకు ఎటువంటి తోడ్పాటునీ అందించలేదని అమెరికాపై ఆరోపణలు గుప్పించారు.

కరోనాపై జీవోఎం భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర మంత్రులతో కూడిన బృందం (జీవోఎం) ఏర్పాటైంది. ఈ జీవోఎంకు సంబంధించి తొలి ఉన్నత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఇందులో జి.కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చైనా వెళ్లేందుకు అవసరమైన ఈ–వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వుహాన్‌ నుంచి భారత్‌ చేరుకున్న 645 మంది గురించి అధికారులు మంత్రులకు తెలిపారు. బీజింగ్, షాంఘై, గువాంఝులలోని ఎంబసీలను సంప్రదించడం ద్వారా అక్కడున్నవారు భారత్‌కు చేరుకోవచ్చని భారత పౌరులకు జీవోఎం సూచించింది. కాగా, ఇప్పటి వరకూ 593 విమానాల్లో 72 వేల మంది పౌరులు భారత్‌కు తిరిగొచ్చినట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement