బీజింగ్‌లో మాస్క్‌ల తయారీ కేంద్రంలో చైనా ప్రధాని లీ కెఖియాంగ్
బీజింగ్/న్యూఢిల్లీ: కోవిడ్–19ను ఎదుర్కోవడంలో భారత్ అందించే సాయాన్ని తీసుకోవడానికి చైనా ఇంకా ముందుకు రాలేదు. కరోనా వైరస్‌తో అతలాకుతలమైపోతున్న వూహాన్‌కి సహాయ సామగ్రిని, అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం కోసం మిలటరీ రవాణా విమానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపింది. అయితే ఆ విమానం ల్యాండ్ అవడానికి చైనా అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ సామగ్రిలో గ్లోవ్స్, సర్జికల్ మాస్క్‌లు, ఫీడింగ్ పంప్స్, గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే డెఫిబ్రిలేటర్స్ ఉన్నాయి. చైనా ఉద్దేశపూర్వకంగానే అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని భారత్‌లో అత్యున్నత స్థాయి అధికారులు వెల్లడించారు.
హుబాయ్ ప్రావిన్స్‌లో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, వైరస్‌ను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై దృష్టి అధికంగా కేంద్రీకరించడంతో, అనుమతినివ్వడంలో జాప్యం జరిగి ఉండవచ్చునని చైనా ఎంబసీ వివరణ ఇచ్చింది. కోవిడ్ సోకుతున్న దేశాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో అంతర్జాతీయంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దక్షిణ కొరియాలో ఒకరు, ఇటలీలో ఇద్దరు వ్యాధిగ్రస్తులు మరణించడం ఆందోళన పుట్టిస్తోంది. సింగపూర్, ఇరాన్, దక్షిణ కొరియా దేశాల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఈ వైరస్‌ను ఎలా నిరోధించాలో అర్థంకాక శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్ప సింగపూర్‌కు ఎవరూ ప్రయాణించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
వూహాన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు
కోవిడ్ తీవ్రతను అంచనావేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అధికారులు వూహాన్‌కు బయల్దేరారు. ఈ వ్యాధి ఒకరికి వ్యాపిస్తే, వారి నుంచి మరో పది మందికి వ్యాపిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. వూహాన్‌లో పరిస్థితుల్ని అంచనా వేసి కోవిడ్‌ను ఎలా నియంత్రించవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment